చెరువులు కబ్జా.. రెచ్చిపోతున్న రూలింగ్ పార్టీ లీడర్లు

నిర్మల్‍, వెలుగు :  నిర్మల్​లో 400 ఏండ్ల కింద నిమ్మనాయుడు తవ్వించిన గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలకు గురవుతున్నాయి. రాజకీయ పలుకుబడితో కొందరు ప్రముఖులు  చెరువులను ఆక్రమించి రియల్​ఎస్టేట్​ వెంచర్లు ఏర్పాటు చేశారు. ఈ భూముల్లో ఇండ్లు, బిల్డింగులు లేస్తున్నా  రాజకీయ ఒత్తిళ్లతో ఆఫీసర్లు పట్టించుకోలేదు. కబ్జాదారుల్లో రూలింగ్​పార్టీ లీడర్లు, వాళ్ల బంధువులు ఉన్నారనే ఆరోపణలున్నాయి. ఖజానా చెరువు భూముల్లో అధికార పార్టీ నేత చుట్టమొకరు రియల్ ఎస్టేట్ వెంచర్ చేశారు. ధర్మసాగర్ చెరువు, క౦చరోని చెరువు, మంజులాపూర్ చెరువు కబ్జాల్లోనూ లీడర్లు, వాళ్ల బంధువులు, అనుచరులపై అనేక ఫిర్యాదులున్నాయి. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా చర్యలు తీసుకోకపోవడంతో  స్థానిక లాయర్​ ఒకరు  ఏడాది కింద గొలుసుకట్టు చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.  దీంతో చెరువులను కాపాడాలని, కబ్జాలపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. దాంతోపాటే ఆక్రమణలపై విచారించి.. రిపోర్టు ఇవ్వాలని  జిల్లా జడ్జికి సూచించింది. ఈ మేరకు జిల్లా జడ్జి ఒక నివేదికను పంపినా..  ఆఫీసర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదు.  దీంతో ఈసారి హైకోర్టు కలెక్టర్ పై సీరియస్​అయ్యింది.  ఎప్పటికప్పుడు ప్రొగ్రెస్​ అడుగుతుండడంతో ఎట్టకేలకు రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్​ ఆఫీసర్లు  రంగంలోకి దిగి ఆక్రమణలను గుర్తిస్తున్నారు.
ఐదు చెరువుల్లో 15 ఎకరాలు కబ్జా 
నిర్మల్​ పట్టణంలో 11 చెరువులు ఉండగా ఇప్పటివరకు ఐదు గొలుసు కట్టు చెరువుల్లో ఆఫీసర్లు ఆక్రమణలు గుర్తించారు. కుర్రనపేట చెరువు ఎఫ్టీఎల్‍, బఫర్‍ జోన్​లో  నిర్మించిన మత్స్యకార సంఘ భవనాన్ని కూల్చి వేసి.. మున్నూరు కాపు సంఘం బిల్డింగ్​ను  సీజ్ చేశారు. ఈ చెరువు పరిధిలో నిర్మించిన 40 ఇండ్లకు నోటీసులు ఇచ్చారు. మరో ఐదెకరాల్లో వెలిసిన రియల్ ఎస్టేట్ వెంచర్లను తొలగించారు.  ధర్మసాగర్‍ చెరువులో  గుడిని,  ఇబ్రహిం చెరువు ఎఫ్టీఎల్‍ పరిధిలో స్లాటర్‍ హౌజ్‍, గ్రేవ్‍ యార్డు, ఒక సబ్‍ స్టేషన్, కంచరోని చెరువు ఎఫ్టీఎల్‍, బఫర్‍ జోన్​లలో  ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్‍, ప్రహరీ, 28 ఇండ్లు, ఒక గుడిని అక్రమంగా నిర్మించినట్టు గుర్తించారు. వారందరికీ నోటీసులు జారీ చేశారు. 28 ప్లాట్లు చేసినట్టు గుర్తించి వాటిని తొలగించారు.  కలెక్టరేట్ సమీపంలోని కొచ్చెరువుకు ట్రెంచ్​ఏర్పాటు చేశారు. మంజులాపూర్ చెరువులో ఇండ్లు, ప్లాట్లను ఏర్పాటు చేశారు. అయిదు చెరువుల భూముల్లో  ఆక్రమణలను గుర్తించారు. మరో ఆరు చెరువుల్లో ఎలాంటి అక్రమణలు లేవని చెబుతున్నారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు ఇచ్చిన అధికారులు.. కొన్ని కట్టడాలను తొలగించడానికి పొలిటికల్​గా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, మరికొన్ని సెన్సిటివ్​ ఇష్యూ కావడం వల్ల  పరిష్కరించడానికి టైమ్​ పడుతుందని అధికారులు హైకోర్టుకు చెప్పారు. ఆక్రమణలు పూర్తిగా తొలగించేందుకు ఏడాది సమయం పడుతుందని వారు చెప్తున్నారు. ఆక్రమణలు తొలగించడంతో పాటు చెరువు చుట్టూ ట్రెంచ్‍లు, ఫెన్సింగ్​ ఏర్పాటు చేస్తున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు.  కాగా, హైకోర్టు జోక్యం చేసుకొని వెంటపడితే తప్ప కదలని ఆఫీసర్ల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

ఎఫ్టీఎల్‍, బఫర్‍ జోన్ల గుర్తింపు

గొలుసు కట్టు చెరువు భూముల విస్తీర్ణంతోపాటు శిఖ౦, ఎఫ్టీఎల్‍, బఫర్ జోన్ లను ఆఫీసర్లు గుర్తించారు. బ౦గల్ పేట చెరువు 210.32 ఎకరాలు, ఖజానా చెరువు 98.22  ఎకరాలు, కొత్త చెరువు 33.11 ఎకరాలు, రాంసాగర్ 37.23 ఎకరాలు,  జాపూర్, కుర్రనపేట చెరువు 76.18 ఎకరాలు, సీతాసాగర్ గొల్లపేట చెరువు 48.11 ఎకరాలు , ఇబ్రహీం చెరువు 76.18, క౦చరోని చెరువు 74.19, ధర్మసాగర్ చెరువు 65.10, మోతి తలాబ 132.06, చిన్న చెరువు మంజులాపూర్ 81.34 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారులు తేల్చారు.  చెరువు శిఖంతోపాటు ఎఫ్టీఎల్ ను కూడా గుర్తించిన అధికారులు ఎఫ్టీఎల్ నుంచి తొంభై అడుగుల దూరం వరకు బఫర్ జోన్ గా  నిర్ధారించారు.

ఆక్రమణలు తొలగిస్తున్నం

హైకోర్టు ఆదేశాల మేరకు గొలుసుకట్టు చెరువుల్లో  కట్టడాలను,  ప్లాట్లను తొలగిస్తున్నాం. ప్రస్తుతం కురన్నపేట చెరువులో ఉన్న ఆక్రమణల తొలగింపుపై దృష్టి పెట్టాం. చెరువు ఎఫ్టీఎల్‍ పరిధిలో నిర్మించిన ఇండ్ల యజమానులకు నోటీసులు ఇచ్చాం. 
- నల్లమల బాలకృష్ణ, 
మున్సిపల్‍ కమిషనర్‍, నిర్మల్‍

ట్రెంచ్​లు  తవ్విస్తున్నం

ఆక్రమణల తొలగింపు తర్వాత స్వాధీనం చేసుకున్న చెరువు భూమి చుట్టూ ట్రెంచులు తవ్విస్తున్నాం. చెరువుల చుట్టూ ఫెన్సింగ్‍ ఏర్పాటు చేస్తున్నాం. ఒక్కో చెరువు రక్షణకు రూ. 5 లక్షలు ఖర్చు చేస్తున్నాం. తిరిగి ఆక్రమణలు జరగకుండా చెరువులను కాపాడుకునేందుకు  చర్యలు తీసుకుంటాం. 
- రామారావు, ఇరిగేషన్‍ ఈఈ

ఈ చిత్రంలో ఆఫీసర్లు పరిశీలిస్తున్నది నిర్మల్​ పట్టణంలోని కంచరోని చెరువులో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్​. అధికార పార్టీ లీడర్ల అండతో కొందరు రియల్టర్లు  ఈ చెరువును కబ్జా చేసి ఎఫ్టీఎల్‍ పరిధిలో ఏకంగా 60 ప్లాట్లు చేశారు. వీటిని దర్జాగా అమ్మకానికి పెట్టడంతో  కొందరు ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఆఫీసర్లు రంగంలోకి దిగి ప్లాట్లను తొలగించారు. కానీ మళ్లీ రియల్టర్లు వచ్చి అమ్ముకోరన్న గ్యారెంటీ లేదు.  ఇలా కోర్టు వార్నింగులు ఇచ్చిన ప్రతిసారీ ఆఫీసర్లు రావడం, సర్వే చేయడం, వాళ్లు వెళ్లిపోయాక ఎప్పట్లాగే ఆక్రమణలు కొనసాగడం ఇక్కడ కామన్​ అయింది.