కేసీఆర్ పాలనలో​ కబ్జాలు.. మాఫియాలు

కేసీఆర్ పాలనలో​ కబ్జాలు.. మాఫియాలు

రాష్ట్రాన్ని టీఆర్​ఎస్​ లీడర్లు దోచుకుంటున్నరు: వివేక్

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: బంగారు తెలంగాణ అంటూ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్​ దోచుకుంటున్నారని బీజేపీ కోర్  కమిటీ మెంబర్, మాజీ ఎంపీ​ వివేక్​ వెంకటస్వామి మండిపడ్డారు. గూండారాజ్​ పాలన సాగుతోందని, టీఆర్​ఎస్​ లీడర్లు భూ కబ్జాలు, ఇసుక మాఫియాకు పాల్పడుతూ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు. లాయర్​ దంపతులు తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నా సర్కార్​ కనికరించలేదని.. టీఆర్​ఎస్​ అండతోనే వారిని కొందరు నడిరోడ్డుపై హత్య చేశారని అన్నారు. కొత్తగూడెంలో బీజేపీ డిస్ట్రిక్ట్​ ప్రెసిడెంట్​ కోనేరు సత్యనారాయణ ఇంట్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివేక్ మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్​ ప్రేమేందర్​రెడ్డిని గెలిపించాలని కోరారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ప్రధాని మోడీ తీసుకెళ్తుంటే.. రాష్ట్రాన్ని కేసీఆర్​ దోచుకుంటున్నారని అన్నారు.

మోసం చేయడంలో కేసీఆర్​ నంబర్​ వన్​

ప్రజలను మోసం చేయటంలో కేసీఆర్​నంబర్​ వన్​ స్థానంలోఉన్నారని వివేక్ విమర్శించారు. అబద్ధాలతో, అమలు కాని హామీలతో ఎన్నికల్లో గెలుపొందటం కేసీఆర్​కే చెల్లిందని దుయ్యబట్టారు.  ‘‘దళితులకు మూడెకరాల భూమి జాడలేదు. రైతులను సన్నవడ్లు వేసుకోవాలని చెప్పి వారిని నష్టాల పాలు చేసిన ఘనత కేసీఆర్​కే దక్కింది. యువతకు నిరుద్యోగ భృతి, జాబ్స్​ ఇవ్వలేని  కేసీఆర్​ తన కుటుంబంలోని వారందరికీ ఉద్యోగాలిచ్చుకున్నారు.  టీఆర్​ఎస్​లో ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారులు లేరు” అన్నారు. సీతారామ ప్రాజెక్ట్​తో చుక్క నీళ్లు అందలేదని, నాగార్జునసాగర్​ ఉప ఎన్నిక నేపథ్యంలో గొర్రెల పంపిణీతో హడావుడి చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు.  ‘‘ఎన్నికలొచ్చినప్పుడే కేసీఆర్​కు పోడు భూములు గుర్తుకు వస్తాయి. జిల్లాలకు తానే వచ్చి పోడు భూముల సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన ఆయన హామీ చెత్తబుట్టలోకి పోయింది. ఫారెస్ట్​ ఆఫీసర్లు పోడు భూముల్లో ట్రెంచ్​ కొట్టడాన్ని ఆపాలి. మైనింగ్, గిరిజన వర్శిటీలు ఎన్నికల హామీలుగానే మిగిలాయి” అని పేర్కొన్నారు. భద్రాచలం శ్రీరామచంద్రస్వామి టెంపుల్​కు రూ. వంద కోట్లు ఇస్తానన్న కేసీఆర్​ మాటలు గోదాట్లో కలిశాయని చెప్పారు.  టీఆర్​ఎస్​ గవర్నమెంట్​లో  సీఐ, ఎస్​ఐ పోస్టులకు రూ. లక్షలు చెల్లించుకోవాల్సి వస్తోందని, పోలీస్​ వ్యవస్థను నాశనం చేస్తున్నారని  ఆగ్రహం వ్యక్తం చేశారు.

సింగరేణిలో అవినీతి రాజ్యం

సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని వివేక్​ వెంకటస్వామి ఆరోపించారు. సింగరేణిలో అక్రమాలు, సీఎండీ తీరుపై విజిలెన్స్​ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు.

వివేక్​ను కలిసిన దివ్యాంగులు

తమ పట్ల టీఆర్​ఎస్​ సర్కారు​ వివక్ష చూపుతోందని వివేక్​కు దివ్యాంగుల స్టేట్ జేఏసీ చైర్మన్​ గుండపనేని సతీశ్  ఆధ్వర్యంలో దివ్యాంగులు వినతిపత్రం అందజేశారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు.