మునుగోడులో ల్యాప్ టాప్, చెక్కులు పంపిణీ చేసిన టీఆర్ఎస్ నేతలు

నల్గొండ: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ నేతలు మునుగోడు ఓటర్లకు ల్యాప్ టాప్ కంప్యూటర్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంచుతూ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించారు. చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఒక యువతికి ల్యాప్ టాప్ ని గిఫ్ట్ గా ఇవ్వగా.. ఎమ్మెల్సీ తాత మధు సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేశారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం తమకు ఏమాత్రం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇక అధికార పార్టీ నేతల వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అధికారులు టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పినట్లు వింటున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిస్తున్న టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. ఒక నియోజకవర్గంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గరి నుంచి కోడ్ అమలులో ఉంటుంది. రాజకీయ పార్టీలు, నేతలు ఎన్నికల నిబంధనలకు లోబడి నడుచుకోవాల్సి ఉంటుంది. కోడ్ అమలులో ఉన్నప్పుడు ఎటువంటి ప్రభుత్వ పథకాలు ఇవ్వడానికి వీలు లేదు.