- గోషామహల్ టీఆర్ఎస్ లో బయటపడ్డ విభేదాలు
- మహమూద్, తలసాని ఎదుట నాయకుల కుమ్ములాట
- ఒకరిపై ఒకరు పిడిగుద్దులు.. సర్దిచెప్పిన హోం మంత్రి
నారాయణగూడ (హైదరాబాద్), వెలుగు: అధికార టీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. హోంమంత్రి మహమూద్ అలీ ఎదుటే గులాబీ నాయకులు గొడవకు దిగారు. ఒకరినొకరు నోటికొచ్చినట్లు తిట్టుకున్నారు. తన్నుకున్నరు. పిడిగుద్దులు గుద్దుకోవడంతో కొద్దీసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో లొల్లి సద్దుమణిగింది. హైదరాబాద్ లోని రాంకోఠిలో ఆదివారం జరిగిందీ ఘటన.
మినిస్టర్లు వెళ్లిన తర్వాత మళ్లా గొడవ
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం గోషామహల్ నియోజకవర్గ నాయకులతో రాంకోఠి లోని రూబీ గార్డెన్స్ లో ఆదివారం జరిగింది. సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో వేదికపైకి స్థానిక కార్పొరేటర్లు, ముఖ్య నాయకులను పిలిచారు. అక్కడే ఉన్న సీనియర్ నాయకుడు ఆర్వీ మహేందర్ కుమార్ ను పిలవకపోవడంతో ఆయన నిలదీశారు. దీంతో జాంబాగ్ డివిజన్ కు చెందిన నాయకుడు జయశంకర్.. ఆర్వీ మహేందర్ తో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఒకరినొకరు తిట్టుకున్నారు. మాటమాట పెరిగి దాడికి దారి తీసింది. మంత్రి మహమూద్ అలీ కలగజేసుకుని ఇద్దరిని శాంతింపజేసి సమావేశం కొనసాగించారు. మీటింగ్ తర్వాత మంత్రులు వెళ్లగానే మరోసారి ఇరువర్గాల నాయకులు దాడులు చేసుకున్నారు. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు కురిపించారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నారాయణగూడ పోలీసులు జోక్యం చేసుకోవడం గొడవ సద్దుమణిగింది. తర్వాత ఇరువర్గాల నాయకులు నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు.
అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయండి
సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డిగ్రీ పూర్తి చేసిన యువత ఓటు నమోదు చేసుకునేలా పని చేయాలన్నారు. పని చేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని, పార్టీ కోసం కష్టపడే వారికి పదవులు లభిస్తాయని చెప్పారు. అంతర్గత గొడవలను పక్కన పెట్టి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.