చండూరు (మర్రిగూడ), వెలుగు: మునుగోడులో బీజేపీ అభ్యర్థిని గెలిపించి టీఆర్‌ఎస్‌ను బొంద పెట్టాలని ప్రజలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ ఉప ఎన్నిక తెలంగాణ పేదల తలరాతను మార్చబోతున్నదని చెప్పారు. కల్వకుంట్ల కుటుంబం వేల కోట్లు సంపాదించుకునే స్థాయికి ఎలా ఎదిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు రావాలని సవాల్ చేశారు. మంగళవారం నల్గొండ జిల్లా మర్రిగూడ మండలంలో బండి సంజయ్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్ట్ లీడర్లు తమ స్వార్థం కోసం కార్యకర్తల పోరాటాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ లీడర్లు కేసీఆర్‌కు అమ్ముడుపోయారని ఆరోపించారు.
రాక్షసులు, రామదండుకు మధ్య యుద్ధం
టీఆర్‌ఎస్ లీడర్ల కండ్లు మునుగోడు భూములపై పడ్డాయని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన గులాబీ లీడర్లు ఊరూరూ తిరుగుతూ భూముల వివరాలు ఆరా తీస్తున్నారని, ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలిస్తే ఇక్కడి భూములన్నింటిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. మునుగోడులో జరిగేది రాక్షసులు, రామదండుకు మధ్య యుద్ధమన్నారు. సిద్దిపేటలో పుస్తెలతాళ్లు తెంపుకొచ్చిన టీఆర్‌ఎస్ లీడర్లు.. ఇప్పుడు మునుగోడు మీద పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయడం వల్లే 15 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ల వద్దకు వచ్చారని, అడిగిందల్లా ఇస్తామని చెబుతున్నారని అన్నారు. ‘‘ఓటుకు రూ.40 వేలు ఇచ్చేందుకు కూడా టీఆర్‌ఎస్ సిద్ధంగా ఉంది. ఆ పైసలు పేదోళ్లను మోసం చేసి, కేంద్ర నిధులను దారి మళ్లించి సంపాదించినవే. టీఆర్ఎస్ ఇచ్చే పైసలు తీసుకొని ఓటు మాత్రం బీజేపీకే వేసి అధికార పార్టీ లీడర్లకు బుద్ధి చెప్పాలి” అని పిలుపునిచ్చారు.
సర్వే రిపోర్టులతో కేసీఆర్‌కు జ్వరం
‘‘హుజూరాబాద్, దుబ్బాకలో ఉప ఎన్నికలు జరిగాయి కాబట్టే అక్కడ కొంతైనా అభివృద్ధి జరిగింది. ఇప్పుడు రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేయగానే గట్టుప్పల్ మండలం ఏర్పాటైంది. కొత్త రోడ్లు మంజూరైతున్నాయ్.. గొర్లకు డబ్బులొస్తున్నాయ్’’ అని బండి సంజయ్ చెప్పారు. ఉప ఎన్నికలు రాగానే కేసీఆర్‌కు పథకాలు గుర్తుకొస్తాయన్నారు. మునుగోడులో బీజేపీ గెలుస్తుందని సర్వే రిపోర్టులు అందగానే కేసీఆర్‌కు జ్వరం పట్టుకుందని, దీంతో ఏం చేయాలో తెలియక ఆయన ఢిల్లీకి పయనమయ్యాడని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు రాని యువత, దళిత బంధు అందని ప్రజలు, డబుల్ బెడ్రూం ఇండ్లు రాని వాళ్లతో పాటు టీఆర్‌ఎస్ పాలనలో మోసపోయిన వాళ్లంతా బీజేపీకి ఓటు వేయాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికపై దరువు ఎల్లన్న, నాగేశ్వర రావు రచించిన పాటలను సంజయ్ ఆవిష్కరించారు. అంతకుముందు పలువురికి పార్టీ కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి తదితరులు పాల్గొన్నారు.