యాదగిరిగుట్టలో మునుగోడు ఓటర్ల స్పెషల్ దర్శనం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఓటర్లను యాదగరి గుట్టకు తీసుకెళ్లిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి.. స్వామివారి ఆరగింపు సేవను నిలిపివేయించి మరీ దర్శనం చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉదయం 15 బస్సుల్లో ఆయన దండుమల్కాపురం గ్రామస్థులను గుట్టకు తీసుకెళ్లారు. అయితే వారు గుట్టపైకి చేరుకునే సరికి సమయం మధ్యాహ్నం 12గంటలు అయింది. వాస్తవానికి మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి ఆరగింపు సేవ జరగాల్సి ఉండగా.. అధికారులు దాన్ని నిలిపేసి మరీ దండు మల్కాపురం ఓటర్లకు కుటుంబ సమేతంగా లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేయించారు. స్వామివారి సేవను నిలిపేసి మునుగోడు ఓటర్లకు దర్శనం చేయించిన అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మునుగోడు నియోజకవర్గం దండుమల్కాపురం గ్రామస్థులను టీఆర్ఎస్ నాయకులు యాదగిరిగుట్టకు తీసుకెళ్లారు. మొత్తం 15 బస్సులో గ్రామస్థులను ఆలయానికి తీసుకెళ్లారు. బస్సులకు 9999 నెంబర్ ఫార్చునర్ కారు ఎస్కార్ట్గా ఉండగా.. అధికారులు నేరుగా వాటిని కొండపైకి అనుమతించారు. గ్రామస్థులందిరికీ 150 రూపాయల స్పెషల్ దర్శనం చేయించారు. దండు మల్కాపురం గ్రామానికి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టీఆర్ఎస్ ఇంచార్జ్గా ఉన్నారు. దర్శనం తర్వాత వారికి విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం. మరోవైపు మునుగోడులో అన్నీ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి.
40 యాటలతో దావత్..?
దండుమల్కాపురం గ్రామస్థులకు యాదాద్రి దర్శనం తర్వాత దావత్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 40 మేకలు కోసి వారికి దావత్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డియే తమను యాదగిరి గుట్టకు తీసుకొచ్చారని గ్రామస్థులు చెప్పినట్లు సమాచారం. ఏదిఏమైనా గ్రామస్థులందరికీ ఎమ్మెల్యే దావత్ ఇవ్వడం చర్చనీయాంశమైంది.