ఎమ్యెల్యే రామలింగారెడ్డి మృతి నాకు వ్యక్తిగతంగా తీరని లోటు

ఎమ్యెల్యే రామలింగారెడ్డి మృతి నాకు వ్యక్తిగతంగా తీరని లోటు

ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి ఉమ్మడి మెదక్ జిల్లాకు, తనకు వ్యక్తిగతంగా తీరని లోటని ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.  రామలింగారెడ్డి మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. రామలింగారెడ్డి అనారోగ్యంతో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన దొమ్మాట, దుబ్బాక నియోజకవర్గాల నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆయన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ గా కూడా పనిచేస్తున్నారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆర్థికశాఖమంత్రి హరీష్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎక్సైజ్ మినిష్టర్ శ్రీనివాస్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి,  మరియు పలువురు ప్రముఖులు రామలింగారెడ్డి కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.

అదేవిధంగా రామలింగారెడ్డి మృతిపట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ సంతాపం వ్యక్తం చేశారు.

‘ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారి మరణం పట్ల సీఎం శ్రీ కేసీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుడు, ఒకే ప్రాంత వాసిగా తనతో ఎంతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు’ అని సీఎంవో ట్వీట్ చేసింది.

‘ఎమ్మెల్యే శ్రీ సోలిపేట రామలింగారెడ్డి మృతి ఉమ్మడి మెదక్ జిల్లాకు, నాకు వ్యక్తిగతంగా తీరని లోటు. ఉద్యమ సహచరుడిగా, తోటి ప్రజా ప్రతినిధిగా ఆయనతో నాకు ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. దుబ్బాక అభివృద్ధి కోసం, ప్రజల కోసం నిత్యం పరితపించిన నాయకుడు. తెలంగాణ ఉధ్యమంలో జర్నలిస్టుగా, ఉధ్యమ కారుడిగా కీలక పాత్ర పోషించారు. నేను లింగన్న అని అత్మీయంగా పిలుచుకునే మంచి మనిషిని కోల్పోవడం దురుదృష్టకరం. వారి అకాల మరణానికి సంతాపాన్ని తెలుపుతూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.