టీఆర్​ఎస్​ వాళ్లను వదిలి బీజేపీ లీడర్లపైనే కేసులు

ఓరుగల్లులో కొనసాగిన ఉద్రిక్తత

బీజేపీ నాయకులకు 14 రోజుల రిమాండ్​

వరంగల్/వరంగల్​రూరల్, వెలుగు: వరంగల్‍ సిటీలో టీఆర్ఎస్, బీజేపీ నేతల నడుమ  ఆదివారం సాయంత్రం నుంచి  కొనసాగిన దాడులు, ప్రతిదాడుల ఎఫెక్ట్​ సోమవారం కూడా కనిపించింది. ట్రైసిటీతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత కొనసాగింది. ఇరువర్గాల ఫిర్యాదులతో కేసులు నమోదు చేసిన పోలీసులు కేవలం బీజేపీ నేతలను మాత్రమే అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన ఘటనలో 57 మంది బీజేపీ లీడర్లను అరెస్ట్​ చేసి 45మందిని మున్సిఫ్​ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో వాళ్లందరినీ జడ్జి14 రోజుల రిమాండ్​కు తరలించారు. కానీ అదే టైంలో బీజేపీ ఆఫీస్​పై, నేతల ఇండ్లపై దాడి చేసిన టీఆర్​ఎస్​ నేతలు, చల్లా అనుచరులను మాత్రం పోలీసులు అరెస్ట్​ చేయలేదు. బీజేపీ వాళ్లు పోలీసులకు వీడియో క్లిపింగులను ఎవిడెన్స్​గా చూపించినా అందులో టీఆరెస్​వాళ్ల ముఖాలు కనిపించట్లేదని చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.

కొనసాగిన అరెస్టులు

బీజేపీ ఆఫీస్​లు, లీడర్ల ఇండ్లపై దాడి చేసిన టీఆర్ఎస్​ కార్యకర్తలను వెంటనే అరెస్టు చేయాలని పార్టీ అర్బన్ జిల్లా అధ్యక్షులు రావు పద్మ డిమాండ్​ చేశారు. ఆమెను అరెస్టు చేసేందుకు పోలీసులు తరలిరాగా.. నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. తమ పార్టీ ఆఫీసుపై, ఇండ్లపై దాడిచేసిన టీఆర్ఎస్ నేతలను కూడా అరెస్టు చేయాలని భీష్మించారు.  రావు పద్మ అధ్యక్షతన పార్టీ అర్బన్​ జిల్లా ఆఫీస్​ నుంచి అదాలత్ సెంటర్​లోని అమరవీరుల స్తూపం వద్ద ధర్నా చేసేందుకు ర్యాలీగా వెళ్లాలని రెడీ అయ్యారు. ఇందుకు పర్మిషన్​ లేదంటూ పోలీసులుఅడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. స్వల్ప ఉద్రిక్తత అనంతరం పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. రావు పద్మ సహా కొంతమంది నేతలను సుబేదారి స్టేషన్​కు, రాకేశ్​ రెడ్డితో పాటు మరికొందరు లీడర్లను కాజీపేట స్టేషన్​కు తీసుకెళ్లారు.

45 మంది బీజేపీ నేతల రిమాండ్​

ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు 57 మందిని నిందితులుగా గుర్తించారు. ఇందులో ఏ1గా పార్టీ అర్బన్​ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, ఏ2గా రూరల్​ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్​ను చేర్చారు. వారందరిపై 353, 332 వంటి నాన్​ బెయిలబుల్​ సెక్షన్లతో పాటు 143, 147, 448, 506 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో 39 మందిని ఆదివారం అర్ధరాత్రే అదుపులోకి తీసుకుని భీమారం సమీపంలోని శుభం గార్డెన్స్​కు తీసుకెళ్లారు. మరికొంతమందిని సోమవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించారు. మొత్తంగా 45 మందిని ఆరో మున్సిఫ్​ మెజిస్ట్రేట్​ ఎదుట హాజరుపరుచగా..వారందరికీ ఈ నెల 15 వరకు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు వారిని సెంట్రల్​ జైలుకు తరలించారు. కాగా ఇంకో 12 మంది పరారీలో ఉన్నారని చెప్పారు.

మంత్రి, ఎమ్మెల్యేపై బీజేపీ లీడర్ల ఫిర్యాదు

టీఆర్ఎస్ నేతలు, ​కార్యకర్తలు బీజేపీ ఆఫీస్​లు, నేతల ఇండ్లపై ఆదివారం సాయంత్రం నుంచే దాడులకు దిగారు. ఆదివారం సాయంత్రం హంటర్​ రోడ్డులోని బీజేపీ అర్బన్​ జిల్లా ఆఫీస్, ఎన్జీవోస్ కాలనీలోని రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్​ రెడ్డి ఇంటిపై దాడి చేశారు. అర్ధరాత్రి పరకాల నియోజకవర్గ కేంద్రంలోని బీజేపీ ఆఫీస్​పై దాడి చేసి పార్టీ బోర్డుకు నిప్పంటించారు. బీజేపీ పరకాల నియోజకవర్గ ఇన్​చార్జ్​ డాక్టర్ విజయచందర్ రెడ్డి స్వగ్రామం దామెర మండలం ల్యాదెళ్లలో ఆయన ఇంటి కాంపౌండ్​ వాల్​ను  కూల్చేశారు. దీంతో బీజేపీ నేతలు మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్​ కార్యకర్తలను రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పుతున్నారని వారితో పాటు 40 మందిపై కంప్లైంట్​ ఇచ్చారు.

శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే లాఠీచార్జ్​ చేస్తారా: సంజయ్

వరంగల్ ఘటనపై మంత్రి కేటీఆర్ చేసిన వాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు ఉన్నాయని బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు. మంత్రి హోదాలో ఉన్న నాయకుడు దాడులను ప్రోత్సహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రామజన్మభూమి ట్రస్టుకు చెందిన కార్యకర్తల మీద పోలీసులు లాఠీచార్జి చేయడం, వారిమీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. సోమవారం ఆయన హైదారాబాద్ లో  మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. వరంగల్ బీజేపీ జిల్లా అధ్యక్షులు రావు పద్మతో పాటు మరో ఐదుగురు మహిళా నాయకులను జైలుకు పంపడం వెనుక మంత్రులు కేటీఆర్, దయాకర్ రావుల ప్రోద్బలం ఉందని ఆరోపించారు. విరాళాల సేకరణపై ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే రామదండు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తుందన్నారు. కేసీఆర్ ప్రోత్సాహం, మంత్రి కేటీఆర్ సూచనల ప్రకారమే ఇదంతా జరిగిందని సంజయ్ ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్..తొలిరోజు అటెండెన్స్ 55%

బడ్జెట్ ఎఫెక్ట్: రూ.6 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద

3.79 కేజీల బంగారం.. 435 క్యారెట్ల వజ్రాల స్మగ్లింగ్