అవసరం వస్తే కాంగ్రెస్తో టీఆర్ఎస్  కలిసే అవకాశం: గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్ ప్రధాని అయ్యే పరిస్థితి ఏర్పడితే కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసే అవకాశం ఉంటుందని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ తరపున పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 18 వేల కోట్ల కాంటాక్ట్ తీసుకున్నాడన్నది జనాల్లోకి పోయిందని.. అది ఎలక్షన్ లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్నది తేలాల్సి ఉందన్నారు. 

మునుగోడులో కాంగ్రెస్ వీక్ అయితే బీజేపీకి లాభం.. బలపడితే టీఆర్ఎస్ పార్టీకి లాభం

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బలహీనపడితే బీజేపీకి లాభం కలుగుతుందని.. లేదంటే.. కాంగ్రెస్ బలపడితే టీఆర్ఎస్ కు  లాభమని గుత్తా సుఖేందర్ రెడ్డి విశ్లేషించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి జనాలను లాక్కునేందుకు రాజగోపాల్ రెడ్డి డబ్బులు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబాన్ని ఇరికించేందుకు ఈడీ, సీబీఐలతో శత విధాల ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో 25 నుంచి 30 వేల ఓట్ల మెజార్టీ తో టీఆర్ఎస్ గెలుస్తుందని గుత్తా సుఖేందర్ రెడ్డి జోస్యం చెప్పారు.