జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర: మంత్రి జగదీశ్ రెడ్డి

మునుగోడు: సీఎం కేసీఆర్ ముందుచూపు వల్లే రాష్ట్రంలోని ప్రజలు రెండు పూటలు అన్నం తింటున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మునుగోడుకు చెందిన ఇతర పార్టీ నాయకులు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా వాళ్లకు పార్టీ కండువా కప్పి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మునుగోడు నియోజవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతోందని, ఈ క్రమంలోనే తమ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్ లో చేరుతున్నారని చెప్పారు. రైతుల కోసం కేసీఆర్ ఎన్నో గొప్ప పథకాలు తీసుకొచ్చారని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు.

దేశంలో ప్రజలు రెండు పూటలు అన్నం తింటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. మహరాష్ట్ర, కర్ణాటక, ఏపీ ప్రజలు తమను తెలంగాణలో కలపాలని, లేకుంటే తమను కేసీఆర్ వద్దకు తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లకుండా కేసీఆర్ ను అడ్డుకునేందుకే బీజేపీ మునుగోడు ఎన్నికకు కుట్ర పన్నిందని ఆరోపించారు. ఎన్ని కుట్రలు పన్నినా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం, బీజేపీని ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ వైపే ఉన్నారని, ప్రభాకర్ రెడ్డి భారీ ఆధిక్యంతో గెలుస్తారని మంత్రి జగదీశ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.