మంత్రులను రంగంలోకి దింపి ప్రచారం స్పీడప్​ చేసిన టీఆర్ఎస్

  • బీజేపీ బలంగా ఉందని సర్వే రిపోర్టులు
  • చండూరు మున్సిపాలిటీపై ఎర్రబెల్లి దయాకర్​ రావు ఫోకస్​
  • మైనార్టీ ఓట్లను పోలరైజ్​ చేసే పనిలో  హోమ్​ మినిస్టర్​ మహమూద్​ అలీ 
  • ఎస్టీల ఓట్ల కోసం నారాయణపూర్​లో మంత్రి సత్యవతి రాథోడ్ మకాం

నల్గొండ, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టులు తెప్పించుకుంటున్న టీఆర్ఎస్​ హైకమాండ్.. చౌటుప్పల్, చండూర్, నారాయణపూర్, గట్టుప్పల్​మండలాల్లో బీజేపీకి ఎక్కువ లీడ్​ఉన్నట్లు తెలిసి కలవరపడుతోంది. ముఖ్యంగా చండూరు, చౌటప్పుల్ మున్సిపాలిటీలతో పాటు తండాలు అత్యధికంగా ఉన్న నారాయణపూర్ , పద్మశాలీలు ఎక్కువగా ఉన్న గట్టుప్పల్​మండలాల్లోనూ కాషాయం పార్టీ బలంగా ఉన్నట్లు టీఆర్ఎస్​ పెద్దలు అంచనాకు వచ్చారు. ఇప్పటికే ప్రతి ఎంపీటీసీ స్థానానికి ఒక ఎమ్మెల్యేను ఇన్​చార్జిగా వేసినప్పటికీ ఈ నాలుగు మండలాలపై స్పెషల్​ ఫోకస్​పెట్టి ఓట్లను పోలరైజ్​ చేసే పనిలో పడ్డారు. 

చండూరుపై ఎర్రబెల్లి ఫోకస్​.. 

హైకమాండ్​ఆదేశాలతో చండూరులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు రంగంలోకి దిగారు. ఇప్పటికే తమ పార్టీ గెలిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని కేటీఆర్ ​ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంత్రి ఎర్రబెల్లి కూడా చండూరులోని అర్బన్ ఓటర్లను ఆకట్టుకునేందుకు చండూరును దత్తత తీసుకొని మున్సిపాలిటీని అన్ని రకాలుగా డెవలప్ చేస్తానని, ఏ సమస్య వచ్చిన ఆదుకుంటానని చెప్తూ ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం చండూరులో దివ్యాంగులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. బీజేపీ నుంచి లీడర్లను లాగేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం చండూరు మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త దోటి వెంకటేశ్​యాదవ్, మరో నేత కోడి శ్రీనివాస్​ను పార్టీలో చేరాలని టీఆర్ఎస్ నేతలు బెదిరిస్తున్నట్లు చెప్పడం కలకలం రేపింది. ఇక పోడుభూములకు పట్టాలివ్వడం లేదని టీఆర్ఎస్​సర్కారుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఎస్టీలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నట్లు సర్వే నివేదికల్లో బయటపడింది. ఎస్టీలకు పదిశాతం రిజర్వేషన్లు ప్రకటించినప్పటికీ నారాయణపూర్​లాంటి మండలాల్లోని ఓటర్లు మాత్రం రాజగోపాల్​రెడ్డి వైపే ఉన్నట్లు తెలిసింది. ఇక్కడి పేదలకు రాజగోపాల్ రెడ్డి తన సొంత డబ్బులతో ఇండ్లు కట్టించడంతోపాటు, కాంగ్రెస్ బలంగా ఉన్న పలు తండాల సర్పంచులు రాజగోపాల్ రెడ్డికి అండగా ఉన్నారని టీఆర్ఎస్​ సర్వేల్లో తేలింది. దీంతో  హైకమాండ్​మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను రంగంలోకి దింపింది. వీరిద్దరూ ఇక్కడే మకాం వేసి గిరిజనులను తండాల నుంచి అడుగు బయట పెట్టకుండా కాపలా కాస్తున్నారు. ఎస్టీలను టీఆర్ఎస్​ వైపు మళ్లించేలా మంత్రి సత్యవతి రాథోడ్ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఆమె పలు తండాల్లో కాంగ్రెస్, బీజేపీ సర్పంచులను, కార్యకర్తలను టీఆర్ఎస్​లో చేర్పించడం గమనార్హం. ఇక ఈ రెండు మున్సిపాలిటీల్లోని  మైనార్టీ ఓటర్లను ఆ కట్టుకునేందుకు హోం మంత్రి మహమూద్​అలీ కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. కొద్ది రోజులుగా చౌటుప్పల్​, చండూరు మున్సిపాలిటీల్లో పర్యటిస్తున్నారు. రెండు రోజుల క్రితం చౌటుప్పల్​లో మైనార్టీలతో భేటీ అయ్యారు. అక్కడే ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. శుక్రవారం చండూరులో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

గట్టుప్పుల్​లో కేటీఆర్ ​టీమ్స్​..

మంత్రి కేటీఆర్ ఇన్​చార్జిగా ఉన్న గట్టుప్పుల్ మండలం లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి వచ్చిన టీమ్​లు మోహరించాయి. రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లే మండలం ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక్కడి పద్మశాలీ ఓటర్లు ఎక్కడ  బీజేపీ వైపు వెళ్లిపోతారనే భయంతో రూలింగ్ పార్టీ  అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. బీజేపీ అగ్రనాయకులు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, ఈటల రాజేందర్ సహా పలువురు ముఖ్యనేతలు గట్టుప్పల్ పై ఫోకస్​ పెట్టడంతో ఈ మండలంలో తాజాగా టీఆర్​ఎస్​ ప్రచారాన్ని ఉధృతం చేసింది.