ఎమ్మెల్యేల కొనుగోలు హైడ్రామా : హైవేపై మంత్రుల ధర్నా

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ఓ జాతీయ పార్టీ  ప్రయత్నించిందని ఆరోపిస్తూ హైదరాబాద్, విజయవాడ హైవే పై చౌటుప్పల్ వద్ద పలువురు రాష్ట్ర మంత్రులు ధర్నాకు దిగారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి,  సుభాష్ రెడ్డి తదితరులు రోడ్డుపై కూర్చొని నినాదాలు చేశారు. నిఖార్సైన తెలంగాణ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో మునుగోడులో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుందని పేర్కొన్నారు. జాతీయ రాజకీయాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ కొత్త మార్పులు తీసుకురాబోతోందన్నారు. ఈ నిరసన కార్యక్రమంతో హైవేపై  కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు ఎంతో ఇబ్బందిపడ్డారు. 

ఏం జరిగింది ? 

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలంటూ హైదరాబాద్లో హైడ్రామా నడిచింది. ఈ ఇష్యూపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే తమకు సమాచారమిచ్చారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డబ్బు, కాంట్రాక్టులు, పదవులతో తమను ప్రలోభపెడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పినట్లు సీపీ తెలిపారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే ఫాంహౌస్ పై రైడ్ చేశామన్నారు. రైడ్లో ఫరీదాబాద్, తిరుపతి, హైదరాబాద్ కు చెందిన ముగ్గురు వ్యక్తులు (సింహయాజులు, నంద కుమార్, రామచంద్రభారతి) దొరికారని.. లీగల్ యాక్షన్ తీసుకుని దర్యాప్తు చేస్తామని  సీపీ వెల్లడించారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.