వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో పుడ్ పాయిజన్ ఘటన పెద్ద ఇష్యూనే కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ అన్నారు. విద్యార్థులు ఒకరిని చూసి మరొకరు భయపడ్డారని చెప్పారు. పిల్లల్ని తాను కలిశానని, ప్రస్తుతం అందరూ బాగానే ఉన్నారని చెప్పారు. ఒక అమ్మాయికి మాత్రం ఆస్తమా ఉండటంతో కొద్దిగా ఇబ్బందిగా ఉందన్నారు. కొందరు విద్యార్ధినీలు నోట్లో వేలు వేసుకుని వాంతులు చేసుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కామెంట్స్ పై బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పిల్లలను మంచిగా చూసుకుంటారని హాస్టల్ కు పంపిస్తే పురుగుల అన్నం పెడుతున్నారని వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉన్నత చదువులు అందిస్తారని హాస్టల్ కు పంపితే తమ పిల్లలను ఆసుపత్రికి పంపారని వాపోతున్నారు. ఫుడ్ పాయిజన్ కు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని వారు మండిపడుతున్నారు. సోమవారం రాత్రి బల్లి పడిన ఆహారాన్ని తిని ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం తెలిసిందే.