- ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే దాడులు
- సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కేసులు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు రెచ్చిపోతున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ విధానాలను, టీఆర్ఎస్ నేతల అక్రమ దందాలను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినోళ్లపై కేసులు పెట్టించి వేధింపులకు గురిచేశారు. ఇప్పుడు ఏకంగా రాజకీయ ప్రత్యర్థులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. వీరిని ఎమ్మెల్యే బాల్క సుమనే రెచ్చగొడుతున్నారనే ఆరోపణలున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రశ్నించినా.. రైతులు, కార్మికుల సమస్యలపై నిలదీసినా.. చివరకు తన మాట వినని ఆఫీసర్లపైనా అనుచరులతో దాడులు చేయిస్తున్నారని ప్రతిపక్ష లీడర్లు అంటున్నారు. ఇందుకు తగ్గట్లే ‘‘పార్టీని, ప్రభుత్వాన్ని ఎవరు పల్లెత్తు మాటన్నా సహించేది లేదు. మీ వెనుక నేనున్నా.. ఎంత దూరమైనా వెళ్లండి. బీజేపీ, కాంగ్రెస్ లీడర్లను తన్ని తరిమేయండి’’ అని టీఆర్ఎస్ కార్యకర్తలకు పలు వేదికల పైనుంచి సుమన్ పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
బీజేపీ బలపడుతోందనే..
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో చెన్నూర్‌లో బీజేపీ బలపడుతోంది. కొన్ని దశాబ్దాల నుంచి కాకా వెంకటస్వామి కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో వివేక్ కు సహజంగానే ఆదరణ లభిస్తోంది. ఆయన నేతృత్వంలో పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జి అందుగుల శ్రీనివాస్, ఇతర నాయకులు రైతులు, సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడుతున్నారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్‌తో రైతులకు జరుగుతున్న నష్టంపై ఎమ్మెల్యే సుమన్‌ను నిలదీస్తున్నారు. పంటలు మునగడంతో ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోగా, బాధిత కుటుంబాలను సుమన్ కనీసం పరామర్శించలేదు. కానీ వివేక్ వ్యక్తిగతంగా ఆర్థిక సాయమందించి ఆదుకున్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, ముంపు భూములను ప్రభుత్వమే సేకరించాలని వివేక్ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల మిర్చి రైతులు, సింగరేణి కార్మికుల సమస్యలపైనా ఫోకస్ పెట్టారు. బీజేపీ కార్యక్రమాలకు మంచి స్పందన రావడంతో జీర్ణించుకోలేని సుమన్ తన అనుచరులను దాడులకు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
టీఆర్ఎస్ నేతల దాడులెన్నో...
- శనివారం మిర్చి రైతుల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన బీజేపీ లీడర్లపై సుమారు వందమంది టీఆర్ఎస్ నేతలు మూకుమ్మడిగా దాడి చేశారు.
- ఇటీవల కేకే2 మైన్ పై బీఎమ్మెస్ మీటింగ్ ను అడ్డుకునేందుకు టీబీజీకేఎస్ నాయకులే కార్మికుల ముసుగులో వచ్చి నినాదాలు చేశారు.
- కోటపల్లి మండలం బబ్బెరచెల్కకు చెందిన నిరుద్యోగి ఆసంపల్లి మహేశ్(25) నిరుడు నవంబర్ లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ నెల 14న బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఓయూ జేఏసీ లీడర్లు వస్తున్నారని బీజేపీ చెన్నూర్ టౌన్ ప్రెసిడెంట్ సుద్దపల్లి సుశీల్ కుమార్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టగా.. టీఆర్ఎస్ నేతలు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఓయూ లీడర్లను అడ్డుకునేందుకు చెన్నూర్‌లో కర్రలతో వీరంగం చేశారు. సుమన్ తో తనకు ప్రాణహాని ఉందని సుశీల్ వాపోతున్నారు.
- నిరుడు డిసెంబర్ లో చెన్నూర్‌లో విద్యుత్ సిబ్బందిపైనా సుమన్ అనుచరులు దాడి చేశారు. దీనికి నిరసనగా విద్యుత్ ఉద్యోగులు ధర్నా చేశారు.
ఇసుక క్వారీకి భూములు లీజుకు తీసుకుని పైసా ఇయ్యలే
ఎమ్మెల్యే బాల్క అనుచరుడి బాగోతం
చెన్నూర్, వెలుగు: చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రధాన అనుచరుడు, కోటపల్లి వైస్ ఎంపీపీ వాల శ్రీనివాసరావు ఇసుక క్వారీ కోసం తమ పట్టా భూములు లీజుకు తీసుకుని ఐదేండ్లుగా పైసలు ఇస్తలేరని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలుగుల గ్రామానికి చెందిన పుప్పాల పద్మ , వీరమల్ల వెంకటేశ్ తో పాటు మరికొందరి వద్ద సర్వే నెంబర్ 77, 79లలో 18.36 ఎకరాలను శ్రీనివాసరావు 2014లో లీజుకు తీసుకున్నారు. ఆ భూములను తన పేరిట రిజిస్ర్టేషన్ చేయించుకున్నారు.
ఇసుక తీసుకున్నంక మళ్లీ పట్టాదారుల పేరిట తిరిగి రిజిస్ట్రేషన్ చేయిస్తానని ఒప్పందం చేసుకున్నారు. కానీ అప్పటి నుంచి లీజు పైసలు ఇయ్యకుండా, గడువు దాటినప్పటికీ భూమి రిజిస్ట్రేషన్ చెయ్యకుండా తమను తిప్పించుకుంటున్నారని బాధితులు వాపోయారు. ఈ విషయం ఎమ్మెల్యే సుమన్ కు చెప్పుదామని ఆదివారం చెన్నూర్ కు వచ్చారు. ఆయన పాత మార్కెట్ ఆఫీసు వద్ద ఓ కార్యక్రమంలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్తే లోపలికి వెళ్లనియ్యలేదు. పోలీసులు వచ్చి వాళ్లను స్టేషన్ కు తరలించారు. మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లగా, ‘‘ఎవరేమీ అడిగినా చెప్పొద్దు” అని బెదిరించి పంపించారు. తమ భూమి ఇప్పించాలని, లేకుంటే తమకు చావే గతి అని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి