నల్గొండ జిల్లా: బండి సంజయ్కి మతి భ్రమించిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఫైర్ అయ్యారు. కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మోడీ, యోగి, బండి సంజయ్ లకే క్షుద్ర పూజలు గురించి తెలుసునని, తమ నాయకుడు కేసీఆర్ కు ఆ అవసరం లేదని చెప్పారు. హిందూ మతం పేరుతో బీజేపీ నాయకులు రాజకీయ పబ్బం గడుపుతున్నారని, వాళ్లకు హిందూ మతంపై ఏమాత్రం గౌరవం లేదని విమర్శించారు. అయోధ్యలో రామాలయం పేరుతో జనాల నుంచి చందాలు వసూలు చేసిన ఘనత బీజేపీ నాయకులకే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
తమ ముఖాలకు ఏనాడైనా యాదాద్రి లాంటి దేవాలయాన్ని నిర్మించారా అంటూ బీజేపీ నాయకులపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ ను మించిన నిజమై హిందూవాది ఈ దేశంలోనే లేడని పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలోనే యాదాద్రిలో అద్భుతమైన దేవాలయాన్ని నిర్మించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని లింగయ్య తెలిపారు.