మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లో ఆందోళన
ఎమ్మెల్యేను అరెస్టు చేయాలని డీకే అరుణ డిమాండ్
రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి డివిజన్లో బీజేపీ క్యాండిడేట్ తోకల శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఇతర నేతలు దాడికి దిగడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. డివిజన్ పరిధిలోని హౌజింగ్‌బోర్డు, పరిసర ప్రాంతాల్లో టీఆర్ఎస్ నేతలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో బీజేపీ క్యాండిడేట్, కార్యకర్తలు వెళ్లి అడ్డుకున్నారు. ఈ సమయంలో గొడవ జరిగింది. టీఆర్ఎస్ నేతలు దీనిపై ఎమ్మెల్యేకు సమాచారం ఇచ్చారు. కాసేపటికే ఎమ్మెల్యే, మరో 200 మంది ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అలా వచ్చినవాళ్లు వచ్చినట్టుగా బీజేపీ క్యాండిడేట్, కార్యకర్తలపై దాడి చేశారు. దీంతో తనకు, కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు గాయాలు అయ్యాయని బీజేపీ క్యాండిడేట్ తోకల శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ నేతలు డబ్బు పంచుతుండటంపై తాము పోలీసులకు సమాచారం ఇచ్చామని.. అక్కడికి వచ్చిన ఎస్సై మీద కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని తెలిపారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్స్టేషన్ఎదుట ధర్నాకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ వైస్ ప్రెసిడెంట్డీకే అరుణ అక్కడికి చేరుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అనుచరులు దాడులకు దిగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలింగ్ ప్రశాంతంగా సాగాలంటే.. ఎమ్మెల్యేను, అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే, అనుచరులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాగా.. ఈఘటనపై డీసీపీ కార్యాలయంలో కంప్లైంట్ చేశామని బీజేపీ నేత స్వామిగౌడ్ తెలిపారు.
For More News..