టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత

టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత

సిద్ధిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, టీఆర్ఎస్ నేత సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బుధవారం చనిపోయారు. రామలింగారెడ్డి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రామలింగారెడ్డి 2004, 2008 ఉపఎన్నికలలో దొమ్మాట నుంచి.. 2014, 2018లలో దుబ్బాక నుంచి పోటీచేసి గెలుపొందారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు సుమారు 25 ఏళ్లు జర్నలిస్టుగా పనిచేశారు. రామలింగారెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడు ర్యాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేశారు. రామలింగారెడ్డి స్వస్థలం దుబ్బాక మండలం చిట్టాపూర్. ఆయనకు భార్య సుజాత, కుమారుడు సతీష్ రెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు. ఆయన 2001 నుంచి TRS అధినేత కేసీఆర్‌తో కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. రామలింగారెడ్డి మృతితో ఆయన నియోజకవర్గంలో విషాదఛాయలు నెలకొన్నాయి.