హన్మకొండ: జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి కేంద్ర టూరిజం మంత్రి కిషన్ రెడ్డి ఓ టూరిస్ట్ గా వచ్చారే తప్ప.. వరంగల్ కు చేసిందేమి లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, అరూరి రమేశ్ విమర్శించారు. శుక్రవారం హన్మకొండలోని R&B గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వానికి కళలు, కళాకారుల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిలేదన్నారు. జాతీయ సాంస్కృతిక మహోత్సవం పేరిట పెద్ద ఆర్భాటం సృష్టించారే తప్ప తెలంగాణ కళాకారులకు చేసింది శూన్యమన్నారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న తనను కార్యక్రమానికి పిలవకుండా అవమానించారని మండిపడ్డారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా కేంద్రం పట్టించుకోవడంలేదని దుయ్యబట్టారు. దమ్ముంటే మేడారం జాతరకు జాతీయ హోదా తీసుకురావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. వడ్లు కొనుగోలు చేయకుండా కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రైతులను ఇబ్బందిపెడుతోందన్నారు.
వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ... జాతీయ సాంస్కృతిక మహోత్సవం బీజేపీ కార్యక్రమంగా మారిందన్నారు. ఈ కార్యక్రమానికి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలను పిలవకుండా కేంద్రం అవమానించిందన్నారు. ఆహ్వాన పత్రికల్లో జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పేర్లు ఎందుకు లేవని ప్రశ్నించారు. మహిళా మంత్రి సత్యవతి రాథోడ్ ను పిలవకుండా.. మహిళలంటే తమకు చిన్నచూపని బీజేపీ నాయకులు మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు. మహిళలను గౌరవించే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడు ముందుంటుందన్నారు.
మరిన్ని వార్తల కోసం..