అర్వింద్ గీత దాటితే వెంటపడి కొడతాం : ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘నేను కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నానని కాంగ్రెస్ సెక్రటరీ చెప్పాడంట.. అరవింద్ ఎందుకు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు’’ అని కవిత ప్రశ్నించారు. ‘‘కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తో అందరికీ ఫ్రెండ్ షిప్ ఉందని..అందరూ ఆయనతో మాట్లాడుతారు’’ అని అన్నారు. నిజామాబాద్ ఎంపీగా అర్వింద్ గెలవడం ప్రజల ఖర్మ అని కామెంట్ చేశారు. ఇంకోసారి తనపై అర్వింద్ నోరుపారేసుకుంటే ఊరుకోమని కవిత హెచ్చరించారు. ఆయన ఎక్కడ పోటీచేసినా తాను వెంటాడి వెంటాడి ఓడిస్తానని స్పష్టంచేశారు. 

నిజామాబాద్కు పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ పై రాసిచ్చి రైతులను అర్వింద్ మోసం చేశారని ఆరోపించారు. బాండ్ పేపర్ రాసిచ్చి.. ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమైనందుకు రేపటి నుంచి పోలీస్ స్టేషన్ లలో రైతులు ఆయనపై చీటింగ్ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు. అర్వింద్ క్వాలిఫికేషన్పైన కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని స్పష్టం చేశారు.