వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే మునుగోడు ఉపఎన్నికను తీసుకొచ్చారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశర్వ్ రెడ్డి అన్నారు. మునుగోడు మండలం పలివేలలో రైతుల ఆత్మీయ పలకరింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రాభివృద్ధికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. కొంతమంది రాజకీయ నాయకులు మోటర్లకు మీటర్లు పెడుతామంటున్నారని.. అటువంటి వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.
గుజరాత్లో కనీసం ఆరు గంటలు కరెంట్ ఇవ్వండని రైతులు మొత్తుకుంటున్నారని..అయినా అక్కడి ప్రభుత్వం స్పందించడం లేదని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరెంట్ కోసం ధర్నా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. రైతుబంధు కోసం దరఖాస్తు పెట్టుకోవాల్సిన పనిలేదని..భూమి పట్టా చేసుకున్న తర్వాత రైతుల ఫోన్కే మూడు సందేశాలు వస్తాయన్నారు. రైతుబంధుకు 7 వేల 500 కోట్లు, రైతుబీమాకు 1450 కోట్లు ఇస్తున్నామన్నారు. పండిన పంట కొనడానికి 7 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని పల్లా తెలిపారు. 2021 లో 141 లక్షల వరి పంట కొనుగోలు చేశామని..దేశంలో అత్యధికంగా వరి ధాన్యం పండిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు.