రాష్ట్ర విభజనపై ప్రధాని మోడీ చేసిన వాఖ్యలు సరికావన్నారు టీఎర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడిందన్నారు. యావత్ తెలంగాణ సమాజం ఒక్కతాటిపైకి వచ్చి ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్లు పోరాడి సాధించుకున్నామన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ ప్రాణాలను లెక్కచేయకుండా 15 ఏళ్లు పోరాడి సాధించారని చెప్పారు. దేశంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఎదుగుతుందనే అక్కసుతో బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే బీజేపీ మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు తెలంగాణను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు నామా నాగేశ్వరరావు. తెలంగాణ ఏర్పడక ముందు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని..టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో సాగునీటి సమస్యను పరిష్కరించామని చెప్పారు. అభివృద్ధిలో గుజరాత్ ను మించిపోతుందనే అక్కసుతో కమలనాథులు తెలంగాణపై విషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు కావస్తున్నా..ఇప్పటి వరకు విభజన హామీలు ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు నామా నాగేశ్వరరావు.
మరిన్ని వార్తల కోసం