మాజీ చైర్‍పర్సన్‍కు కాకుండా.. ప్రత్యర్థికి టీఆర్ఎస్ బీఫామ్​

ఐదేళ్ల క్రితం ప్రత్యర్థిగా పోటీ చేసిన వ్యక్తికి టీఆర్ఎస్​ టికెట్​

నామినేషన్​ విత్​డ్రా చేసుకున్న ఆదిలాబాద్​ మున్సిపల్ మాజీ చైర్​పర్సన్​​

ఆదిలాబాద్‍, వెలుగు: ఆదిలాబాద్‍ మున్సిపల్‍ మాజీ చైర్‍పర్సన్ రంగినేని మనీషాకు సొంత  పార్టీ నుంచే చుక్కెదురైంది.  టీఆర్‍ఎస్‍ తరఫున ఐదేళ్లపాటు చైర్‍పర్సన్‍గా  పనిచేసిన ఆమె మరోసారి పీఠాన్ని దక్కించుకోవాలని భావించారు. కానీ ఆమె ఆశలపై  సొంత పార్టీ నేతలే  నీళ్లు చల్లారు. చైర్మన్ పదవి అటుంచితే కనీసం ఆమెకు కౌన్సిలర్‍ టికెట్‍ కూడా ఇవ్వలేదు.  బి-ఫామ్​ఇవ్వకుండా నిరాకరించి పోటీ నుంచి తనకు తానుగా తప్పుకునేలా చేశారు.  ఐదేళ్ల కిందట ఆమెకు ప్రత్యర్థిగా పోటీచేసిన యువకుడికి టీఆర్‍ఎస్‍ టికె ట్‍ను కేటాయించారు.  దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మనీషా  కన్నీంటి పర్యంతమయ్యారు.  భర్త రంగీనేని పవన్‍రావుతో  కలిసి మంగళవారం టీటీడీసీకి వచ్చిన ఆమె నామినేషన్‍ విత్‍డ్రా చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్నపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  తన కొడుకును చైర్మన్‍గా చేసేందుకే తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం తమ ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే జోగు రామన్న తన కొడుకును మున్సిపల్‍ చైర్మన్‍గా చేస్తున్నాను, ఇందుకు పార్టీ అధిష్ఠానం సైతం ఒప్పుకుంది,  మద్దతివ్వాలని తమను కోరారన్నారు.  చైర్మన్‍ ఎవరైనప్పటికి తనకు కౌన్సిలర్‍గా పార్టీ టికె ట్‍ఇచ్చి ఆశీర్వదించాలని తాను ఆయన్ను కోరినట్లు తెలిపారు. ఓ ఆడబిడ్డగా తాను కౌన్సిలర్‍ టికెట్‍ అడిగితే సంక్రాంతి కానుకగా కన్నీళ్లను గిఫ్ట్​గా ఇచ్చారన్నారు. కేసీఆర్‍ను రాజకీయ గురువుగా భావిస్తానని తనకు జరిగిన అన్యాయాన్ని పార్టీ అధిష్ఠానం గుర్తించి న్యాయం చేస్తుందని భావిస్తున్నానన్నారు.