- మేయర్ పోస్టుకు.. మీరూ పోటీ చేయండి ప్లీజ్!
- మజ్లిస్‌ను బతిలాడుతున్న టీఆర్ఎస్
- ఇద్దరి మధ్య దోస్తీ లేదని చెప్పేందుకే ప్లాన్
- టీఆర్ఎస్ ప్రపోజల్ పై ఎటూ తేల్చని మజ్లిస్
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికపై మజ్లిస్ తో టీఆర్ఎస్ మంతనాలు జరుపుతోంది. అయితే ఆ మంతనాలు తమకు మద్దతు ఇవ్వాలని కాదు. తమపై పోటీకి క్యాండిడేట్ ను నిలపాలని మజ్లిస్ ను వేడుకుంటున్నట్లు తెలిసింది. మజ్లిస్ పోటీకి దూరంగా ఉంటే.. వాళ్లతో తమకు స్నేహం ఉందనే సంకేతాలు వెళ్తాయని టీఆర్ఎస్ పెద్దలు ఆందోళన చెందుతున్నట్టు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ నెల 11న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 సీట్లు గెలుపొంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. బీజేపీ 48, ఎంఐఎం 44 సీట్లలో విజయం సాధించగా.. కాంగ్రెస్ కేవలం 2 సీట్లలో గెలిచింది. ఏ పార్టీ సహకారం లేకుండానే టీఆర్ఎస్ సొంతంగా మేయర్ సీటు గెలుచుకోవచ్చు. అయితే ఏకగ్రీవంగా ఎన్నిక జరిగితే మజ్లిస్ తో అవగాహన ఉందనే అపవాదు వస్తదని టీఆర్ఎస్ కు భయం పట్టుకుంది. అందుకే మేయర్ ఎన్నికలో పోటీ చేయాలని మజ్లిస్ ను కోరుతున్నట్టు ఆ పార్టీ లీడర్లే చెబుతున్నారు.
అసదుద్దీన్ తో చర్చలు…
మేయర్ ఎన్నికపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీతో ప్రగతిభవన్ వర్గాలు టచ్ లో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ డైరెక్షన్ మేరకే కొందరు లీడర్లు అసద్ తో మాట్లాడినట్టు తెలిసింది. ప్రస్తుతం అసద్ పశ్చిమ బెంగాల్ ఎన్నికలపై దృష్టి పెట్టడంతో.. ఆయన టీఆర్ఎస్ ప్రపోజల్ పై తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. రెండు మూడ్రోజుల్లో డెసిషన్ తీసుకునే చాన్స్ ఉందని తెలిసింది.
బీజేపీపై భయంతోనే…
మజ్లిస్, -టీఆర్ఎస్ మధ్య దోస్తీ ఉందని బీజేపీ మొదట్నుంచీ ఆరోపిస్తోంది. ఎన్నికల టైమ్ లో రెండు పార్టీల మధ్య ఉత్తుత్తి పోటీ ఉంటుందని, ఆ తర్వాత పదవులు పంచుకుంటాయని విమర్శలు చేస్తోంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో మజ్లిస్, టీఆర్ఎస్ విడివిడిగా పోటీ చేశాయి. కానీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను పంచుకున్నాయి. గ్రేటర్ లో కేవలం టీఆర్ఎస్ పోటీ చేస్తే, రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహనతోనే మజ్లిస్ పోటీకి దూరంగా ఉందనే విమర్శలు వస్తాయని హైదరాబాద్ కు చెందిన ఓ టీఆర్ఎస్ లీడర్ చెప్పారు. అందుకే మేయర్ ఎన్నికలో పోటీ చేయాలని.. మజ్లిస్ లీడర్లతో ప్రగతిభవన్ వర్గాలు సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపారు.
బీజేపీ వ్యూహంపై టీఆర్ఎస్ ఆరా..
మేయర్ ఎన్నికపై బీజేపీ వ్యూహం ఏమిటని టీఆర్ఎస్ ఆరా తీస్తోంది. పోటీ చేస్తుందా? లేక దూరంగా ఉంటుందా? అనే వివరాలను నిఘా వర్గాల నుంచి సేకరిస్తోంది. ఒకవేళ బీజేపీ తన అభ్యర్థిని పోటీకి దింపితే.. అప్పుడు మజ్లిస్ తో పోటీ చేయించక తప్పదని టీఆర్ఎస్ లీడర్లు భావిస్తున్నారు. లేకపోతే బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా రెండు పార్టీల మధ్య అవగాహన ఉందనే విషయం నిజమవుతుందని ఓ టీఆర్ఎస్ లీడర్ అభిప్రాయపడ్డారు. అందుకే బీజేపీ వ్యూహంతో సంబంధం లేకుండానే మజ్లిస్ తో పోటీ చేయించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలిసింది.
For More News..