14న ఆదిలాబాద్ లో TRS పార్లమెంటరీ సన్నాహక సభ

ఈనెల 14న ఆదిలాబాద్ లో జరిగే TRS పార్లమెంటరీ సన్నాహక సభను విజయవంతం చేసేందుకు క్యాడర్ సిద్ధమవుతోంది. KTR సభ కోసం కార్యకర్తల సమీకరణకు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ముందస్తు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కాలేజీలో నిర్వహించే సభకు 15వేల మందిని తరలించేందుకు ప్లాన్ చేశారు.

తెలంగాణలో 16 పార్లమెంటు సీట్ల టార్గెట్ గా TRS సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈనెల 14న సభ జరగబోతుంది. డైట్ కాలేజ్ గ్రౌండ్ లో ఆదిలాబాద్ ఎంపీ పరిదిలో ఉన్న ఏడు నియోజకవర్గాలు బోథ్, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, ఆసిఫాబాద్, సిర్పుర్(టి) అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తల సమావేశం జరుగుతోంది. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఇప్పటికే ముందస్తు కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మొదటిసారి జిల్లాకి వస్తున్న కేటిఆర్ కి ఘన స్వాగతం పలికేందుకు నేతలు, కార్యకర్తలు సిద్దమౌతున్నారు.

అభ్యర్థి ఎవరైనా.. భారీ మెజారిటీతో గెలిపిస్తామంటున్నారు ఆదిలాబాద్ టీఆర్ఎస్ నేతుల. కేంద్రంలో తెలంగాణ ఎంపీలు కీలకపాత్ర పోషించేలాంటే టీఆర్ఎస్ నే గెలిపించాలంటున్నారు జిల్లా నేతలు.

ఈనెల 14న మధ్యాహ్నం 2 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటారు  TRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్. సభలో 2 గంటల పాటు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన తర్వాత ముఖ్య నేతలతో సమావేశమౌతారు. రాత్రి ఆదిలాబాద్ లోనే బస చేసి ఉదయం రామగుండంలో జరిగే పెద్దపల్లి పార్లమెంట్ సన్నాహక సమావేశానికి వెళ్తారు కేటీఆర్.