మునుగోడు బై పోల్ షెడ్యూల్ ను ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో అందుకోసం టీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు మొదలుపెట్టింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మండలాలు, మున్సిపాలిటీల వారీగా మొత్తం 86 మంది పార్టీ నేతలను ఇంచార్జిలుగా ప్రకటించింది. దీనికి సంబంధించి జాబితాను టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. చండూరు మున్సిపాలిటీకి ఐదుగురిని, చండూరు మండలానికి 11 మందిని, చౌటుప్పల్ మున్సిపాలిటీకి 10 మందిని, చౌటుప్పల్ మండలానికి 12 మందిని, మర్రిగూడ మండలానికి 11 మందిని, మునుగోడు మండలానికి 13 మందిని, నాంపల్లి మండలానికి 11 మందిని, నారాయణపూర్ మండలానికి 13 మందిని ఇంచార్జిలుగా నియమించింది. గట్టుప్పల్ కు మంత్రి కేటీఆర్, చండూరులోని 10 వార్డులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్ ను నియమించారు. మర్రిగూడ మండలానికి మంత్రి హరీష్ రావుకు కేసీఆర్ బాబాధ్యతలు అప్పగించారు.
చండూరు మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఇంచార్జిలు : ఎమ్మెల్యే బాల్క సుమన్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఎమ్మెల్యే డి.వినయ్ భాస్కర్.
చౌటుప్పల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఇంచార్జిలు : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ గౌడ్, బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే చింతం ప్రభాకర్, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.
దసరా తర్వాత కేటాయించిన గ్రామాలకు ఇంచార్జిలు
ఇక మునుగోడు ఉప ఎన్నిక బాధ్యతలను మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే అప్పగించారు. మునుగోడు నియోజకవర్గానికి టీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జీలుగా నియమితులైన వారంతా దసరా పండుగ తర్వాత కేటాయించిన గ్రామాలకు వెళ్లాలని కేసీఆర్ ఆదేశించారు. ఎన్నికల ప్రచారం ముగిసే దాకా నియోజకవర్గంలో అందుబాటులో ఉంటూ ప్రచారం చేయాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యే 20 మంది అనుచరులతో కలిసి గ్రామాలకు వెళ్లాలన్నారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలు అందజేస్తామని, వారి ఇండ్లకు వెళ్లి టీఆర్‌ఎస్‌కు ఓటు వేసేలా వారిని ఒప్పించాలన్నారు. ఈనెల నాలుగో వారంలో తాను ఉప ఎన్నిక ప్రచారానికి వస్తానని సీఎం కేసీఆర్ ఇటీవల వెల్లడించారు. మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంచార్జిలు ప్రచారం చేయాలని.. కేటీఆర్, హరీశ్ రావు ఎప్పటికప్పుడు ప్రచార సరళిని పర్యవేక్షిస్తారని చెప్పారు. వారిద్దరితో పాటు కేబినెట్‌లోని మంత్రులు కూడా ప్రచారానికి వస్తారని తెలిపారు.