కేవలం మేయర్, డిప్యూటీ మేయర్ వార్డుల్లోనే అభివృద్ధి జరుగుతోంది
మున్సిపల్ సిబ్బందిని మేయర్ సొంత పనులకు వాడుకుంటున్రు
మేడ్చల్ జిల్లా: జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ మీటింగ్ ను అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు బహిష్కరించారు. కార్పొరేషన్ ఏర్పడి మూడేళ్లయినా ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని.. కేవలం మేయర్, డిప్యూటీ మేయర్ వార్డుల్లోనే అభివృద్ధి జరుగుతోందని మండిపడ్డారు. మున్సిపల్ సిబ్బందిని మేయర్ సొంత పనులకు వాడుకుంటుండ్రు అని ఆరోపించారు.
మేయర్, డిప్యూటీ మేయర్ల తీరుతో విభేదించి.. అసంతృప్తి వ్యక్తం చేస్తూ 20 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం కౌన్సిల్ హాలు బయట మీడియాతో మాట్లాడారు. తమ వార్డుల్లో అభివృద్ధి పనులు జరగడంలేదని ప్రతి కౌన్సిల్ మీటింగ్ లో విన్నవించుకుంటున్నా ఎలాంటి ప్రయోజనం లేదని.. తమకు కనీస మర్యాద కూడా ఇవ్వట్లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కౌన్సిలర్లందరికీ సమానంగా నిధులు కేటాయించాలని మంత్రి చెప్పినా.. మేయర్, డిప్యూటీ మేయర్ పట్టించుకోవడం లేదన్నారు. మేయర్ సొంత ఇంటి పనులకు కౌన్సిల్ సిబ్బందిని ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.
‘‘అభివృద్ధి పనులు అందరికీ సమానం అని చెబుతారు.. వీధి లైట్లు వచ్చినా... అవసరమైనన్ని ఇవ్వరు.. కరెంట్ పోల్స్ వచ్చినా అందరికీ సమానమే అంటారు.. కానీ.. వారిచ్చే వాటితో పూర్తి కావు.. నిధులు కూడా ఇష్టం వచ్చినట్లు కేటాయింపులు చేస్తున్నారు.. అధికార పార్టీలో ఉండి ఈ విషయాలన్ని బహిరంగంగా చెప్పాల్సి వస్తుండడం బాధాకరం..’’ అని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
మా నిరసనకు పార్టీతో సంబంధం లేదు.. వ్యక్తిగతం: కార్పొరేటర్లు
మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ ను బహిష్కరించడం కార్పొరేటర్లుగా తమ అందరి వ్యక్తిగత నిర్ణయమే తప్ప పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కార్పొరేటర్లు ప్రకటించారు. కౌన్సిల్ లో ఉన్న 20 మంది కార్పొరేటర్లం సమావేశాన్ని బహిష్కరించి మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు చెబుతున్నామన్నారు. ఎన్నికల్లో కష్టపడి గెలిచి వచ్చిన తాము ప్రజలకు జవాబుదారీగా ఉన్నామని.. అయితే మున్సిపల్ కార్పొరేషన్లో తాము ఉన్నా ఒక్కటే.. లేకున్నా ఒక్కటే అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విషయాన్ని తెలియజేసేందుకే సమావేశాన్ని బహిష్కరించామని తెలిపారు.