- 21న మునుగోడులో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిక
యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తుర్కపల్లి మండలంలోని 20 గ్రామాలకు చెందిన గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, టీఆర్ఎస్ అన్ని విభాగాల నాయకులతో కలిపి దాదాపుగా 500 మంది శుక్రవారం పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. టీఆర్ఎస్ బహిష్కృత నేత, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పడాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహానికి రాజీనామా పత్రాలను సమర్పించారు.
ఈ నెల 21న మునుగోడులో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు పడాల శ్రీనివాస్ ప్రకటించారు. తనతోపాటు తుర్కపల్లి టీఆర్ఎస్‌కు చెందిన 5 వేల మంది బీజేపీలో చేరుతారని తెలిపారు. టీఆర్ఎస్‌లో ఉద్యమకారులకు, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తుర్కపల్లి మండలం నుంచి మునుగోడు బహిరంగ సభకు దాదాపుగా వెయ్యి వెహికల్స్‌తో ర్యాలీగా వెళ్లనున్నట్లు తెలిపారు.