- బండి సంజయ్ దీక్ష పచ్చి అవకాశవాదం
- ఇప్పటిదాకా ఎన్ని ఉద్యోగాలిచ్చారో దేశానికి లెక్క చెప్పే దమ్ముందా..?
- NDA అంటేనే నో డేటా అవైలెబుల్ సర్కార్
- నిరుద్యోగ దీక్ష కాదు.. సిగ్గులేని దీక్ష
- టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
హైదరాబాద్: బీజేపీ నేతలు.. బండి సంజయ్ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమన్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. బీజేపీ నేతలు చేసేది నిరుద్యోగ దీక్ష కాదు సిగ్గులేని దీక్ష అన్నారు. ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై ఆయన ఆదివారం బహిరంగ లేఖ రాశారు. బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏ గంగలో కలిసిందో చెప్పాలని ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఎన్ని కోట్ల కొలువులు ఇచ్చారో దేశానికి లెక్క చెప్పే దమ్ముందా అని అడిగారు కేటీఆర్. హైదరాబాద్ కు రావాల్సిన ITIR ప్రాజెక్టును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. బీజేపీ కపట ప్రేమను చూసి అవకాశావాదమే సిగ్గుతో ఆత్మహత్య చేసుకుంటుందని విమర్శించారు. డిమానిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాలతో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఊడిన ఉద్యోగాలు ఎన్నో చెప్పాలని ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వం కానీ, బీజేపీ అదికారంలో ఉన్న రాష్ట్రాల్లో కానీ ఎన్ని ఉద్యోగాలు కల్పించారో శ్వేపపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు మంత్రి KTR. యువతను రెచ్చగొట్టి, ఉద్యోగ ప్రయత్నాల నుంచి దృష్టిని పక్కదారి పట్టించేందుకే బీజేపీ దొంగ దీక్ష చేస్తోందన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ జంతర్ మంతర్ లో దీక్ష చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 15లక్షల ఖాళీలను ఎందుకు భర్తీ చేయలేదో ప్రధానిని ప్రశ్నించాలన్నారు. రాజకీయ నిరుద్యోగంతో దీక్షకు దిగుతున్నారని.. ఆత్మవంచన చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ఉపాధి కల్పనలో తమ నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు కేటీఆర్.
..
రాష్ట్రంలో ఏటా లక్షలాది యువతీయువకులు డిగ్రీలతో బయటికి వస్తున్నారన్నారు కేటీఆర్. డిగ్రీ పూర్తయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని ప్రపంచంలో ఏ దేశమూ, ఏ ప్రభుత్వమూ కల్పించలేదన్నారు. అలాగని తాము కేంద్ర ప్రభుత్వం లాగా బాధ్యత నుంచి తప్పించుకోవడం లేదన్నారు. అచ్చే దిన్ అంటూ అశ చూపి, రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దేశ నిరుద్యోగ యువతకు ఏం చేసిందో చెప్పాలన్నారు. ఇప్పటిదాకా ఎన్ని కోట్ల కొలువులు ఇచ్చారో దేశానికి లెక్క చెప్పే దమ్ముందా బీజేపీ నేతలకు ఉందా అని ప్రశ్నించారు. ఏ వివరాలు అడిగినా డేటా లేదు.. తెలియదు గుర్తులేదు.. మర్చిపోయాం అని తప్పించుకుంటారని విమర్శించారు. NDA అంటేనే నో డేటా అవైలెబుల్ సర్కార్.. అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కేటీఆర్.
ఇవి కూడా చదవండి:
బదిలీ అయిన గన్ మెన్లకు ఘనంగా వీడ్కోలు పలికిన ఎమ్మెల్యే
28 నుంచి కర్నాటకలో రాత్రిపూట కర్ఫ్యూ