నల్గొండ, వెలుగు: ఓవైపు ఉప ఎన్నికలకు టైం దగ్గరపడ్తున్నా అధికార పార్టీ నుంచి మునుగోడు ప్రజలపై ఇప్పటివరకు ఎలాంటి హామీలు, వరాలు కురవలేదు. హుజూరాబాద్, హుజూర్‌గర్, సాగర్ ఎన్నికల టైంలో వందల కోట్ల పనులకు హామీలు, పలు స్కీములు ప్రకటించిన టీఆర్ఎస్ హైకమాండ్ ఇప్పుడు సైలెన్స్ అయ్యింది. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యే కావడం వల్లే రాష్ట్ర సర్కారు మునుగోడు నియోజకవర్గంపై కక్ష కట్టిందని, అభివృద్ధి పనులకు నిధులు కేటాయించకపోవడం వల్లే తాను రాజీనామా చేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచీ చెప్తున్నారు. తీరా ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అభివృద్ధి పనులకు ఫండ్స్, కొత్త స్కీములు ప్రకటిస్తే అది కాస్తా రాజగోపాల్ రెడ్డికే అనుకూలంగా మారుతుందని గులాబీ పెద్దలు భావిస్తున్నారు. హుజూరాబాద్ అనుభవం నేపథ్యంలో ఆచితూచి ముందుకెళ్తున్నారు.
మూడు ఉప ఎన్నికల్లో నిధుల వరద..
రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన మూడు ఉప ఎన్నికల్లో నిధుల వరద పారించిన సీఎం కేసీఆర్ తీరా మునుగోడులో ఎన్నికల వ్యూహం మార్చేశారు. సాగర్ నియోజకవర్గంలో పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు రూ.150 కోట్లు, హుజూర్‌నగర్‌లో రూ.100 కోట్లకు పైగా ఎస్డీఎఫ్ నిధులు కేటాయించారు. ఇవిగాక లిఫ్టు స్కీములు, కాలేజీలు, హాస్పిటళ్లు.. ఇలా అనేక హామీలు, వరాలు గుప్పించారు. ఇక హుజూరాబాద్‌లో నిరుడు అక్టోబర్ లో జరిగిన ఎన్నికల సందర్భంగా రూలింగ్ పార్టీ దళితబంధు స్కీం, వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.5 వేల కోట్ల దాకా ఖర్చు చేసింది. దేశచరిత్రలోనే కనివిని ఎరగని రీతిలో నిధుల వదర పారిస్తే, తీరా ఆ క్రెడిటంతా ఈటల రాజేందర్ కే దక్కింది. తాను రాజీనామా చేయడం వల్లే ఊరూరా రోడ్లు, భవనాలు, కమ్యూనిటీ హాళ్లు, దళిత బంధు లాంటి స్కీంలు వచ్చాయని, మూడేండ్లుగా పెండింగ్‌లో పెట్టిన కొత్త పింఛన్లు సాంక్షన్ చేశారని రాజేందర్ ప్రచారం చేసుకున్నారు. ఓటర్లు కూడా ఇదే అభిప్రాయంతో ఈటలను గెలిపించారు. తాజాగా రాజగోపాల్ రెడ్డి కూడా ఇదే తరహా ప్రచారం చేసుకుంటున్నారు. తాను బీజేపీలో చేరి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిసే గట్టుప్పల్‌ను కొత్త మండలంగా ప్రకటించారని, ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభించారని చెప్పుకుంటున్నారు. ఇలా ఈ రెండు కూడా రాజగోపాల్ రెడ్డి ఖాతాలో పడినట్లు రూలింగ్ పార్టీ గుర్తించింది. దీంతో మునుగోడులో కొత్త హామీలు, వరాల జోలికి వెళ్లకుండా ఓటర్లకు నేరుగా లబ్ధి చేకూర్చడంపైనే టీఆర్ఎస్పెద్దలు ఫోకస్పెట్టినట్లు తెలుస్తోంది.
ఓటర్లకు నేరుగా లబ్ధి?
మునుగోడు ఎన్నికల సందర్భంగా పెండింగ్ ప్రాజెక్టులు, రోడ్లు, డ్రైన్లు, బిల్డింగులకు సీఎం కేసీఆర్ ఫండ్స్ కేటాయిస్తే, ఇన్నాళ్లూ నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి చేయలేదని సర్కారే ఒప్పుకున్నట్లు అవుతుంది. ఇలా చేస్తే రాజగోపాల్‌రెడ్డి చేతికి మరో అస్త్రం దొరికినట్లేనని టీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తోంది. అందువల్ల అభివృద్ధి పనుల జోలికి వెళ్లకుండా ఓటర్లకు నేరుగా లబ్ధి చేకూర్చే కార్యక్రమాలపైనే ఫోకస్ పెట్టాలని గులాబీ పెద్దలు నిర్ణయించారు. ఇటీవలే గొర్రెల స్కీం పేరిట లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా రూ.93 కోట్లు జమ చేశారు. ఈ క్రెడిట్ కూడా రాజగోపాల్‌రెడ్డి ఖాతాలోనే పడిందనే భావన నెలకొంది. ఈక్రమంలో ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలనే దానిపై రూలింగ్పార్టీ లీడర్లు మల్లగుల్లాలు పడ్తున్నారు. హుజూరాబాద్‌లో రూలింగ్పార్టీ లీడర్లు పోలింగ్‌కు ఒక రోజు ముందు ఒక్కో ఓటుకు రూ.6వేల చొప్పున పంపిణీ చేశారనే వార్తలు వచ్చాయి. అందనివాళ్లు ఆందోళనకూ దిగారు. దీంతో ఈసారి ఏ రూట్లో వెళ్లాలనేదానిపై తమ హైకమాండ్ సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీ కి చెందిన సీనియర్‌నేత వ్యాఖ్యానించడం గమనార్హం.