గ్రేటర్‌లో గులాబీ అంచనాలు తలకిందులు

ఫలించని టీఆర్ఎస్ వ్యూహం

కార్పొరేటర్లపై ఉన్నవ్యతిరేకతను లెక్క చేయకుండా టికెట్లు కేటాయింపు
ముషీరాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్, అంబర్ పేట్‌లో భారీ మూల్యం

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ లో టీఆర్ఎస్ అనుకున్నదొక్కటీ…. అయ్యిందొక్కటీ. సిట్టింగ్ కార్పొరేటర్లపై మస్తు వ్యతిరేకత ఉన్న సరే  ఎన్నికల్లో గెలిచేస్తామని పార్టీలో ధీమా ఉండేది.  గత ఎన్నికల్లో మాదిరిగా కేటీఆర్, కేసీఆర్ పేరుతోనే ఈ సారి గెలుసుడు ఖాయమవనుంది. ఇక్కడే కారు బొక్క బోర్లా పడింది. స్థానిక కార్పొరేటర్లపై ఉన్న వ్యతిరేకత ముందు కేటీఆర్, కేసీఆర్, వరద సాయం, ఉచిత వాటర్ హామీలు ఏదీ పనిచేయలేదు. ఐదేళ్లుగా కార్పొరేటర్లపై ఉన్న కోపాన్ని ఎన్నికల్లో ఓటు రూపంలో తీర్చుకున్నరు. దీంతో గ్రేటర్ లో గెలిసేందుకు పై స్థాయిలో రచించిన వ్యూహాలన్నీ బెడిసి కొట్టాయి. నిజానికి సిట్టింగ్ కార్పొరేటర్లపై తీవ్ర వ్యతిరేకత ఉన్న విషయం టీఆర్ఎస్ పెద్దలకు కూడా తెలుసు కానీ ఓటర్లు ఇవన్నీ పట్టించుకోరని భావించారు.

ఫుల్ వ్యతిరేకత

టీఆర్ఎస్ కార్పొరేటర్ల లో చాలా మందిపై జనాల్లో ఫుల్ వ్యతిరేకత ఉంది. ఐదేళ్లలో భూకబ్జాలు, బిల్డింగ్ పర్మిషన్లకు వసూళ్లు, జనాలకు అందుబాటులో ఉండరన్న విమర్శలు ఉన్నాయి. వీటికి తోడు మొన్నటి వరదల్లో కార్పొరేటర్లు అడ్రస్ లేకుండా పోవటం, వరద సాయాన్ని బాధితులకు దక్కకుండా చేశారన్న కోపం జనంలో పెరిగిపోయింది. దీంతో 28 మంది సిట్టింగ్ లకు ఈ సారి టికెట్లు కేటాయించలేదు. కానీ దాదాపు 90 శాతం మంది సిట్టింగ్ లపై జనంలో వ్యతిరేకత ఉంది. అన్ని స్థానాల్లో క్యాండిడేట్లను మార్చటం సాధ్యం కాకపోవటంతో స్వయంగా కేటీఆర్ కార్పొరేటర్లపై వ్యతిరేకత ఉన్నా సరే తనను చూసి ఓటేయాలని కోరారు. 103 స్థానాల్లో గెలవాలని ఆ పార్టీ టార్గెట్ పెట్టుకొని క్యాండిడేట్లను సెలెక్ట్ చేసింది. కానీ సిట్టింగ్ లలో 44 మంది ఓడిపోయారు. వ్యతిరేకత ఉన్న వాళ్లకే టికెట్లు ఇవ్వటంతోనే బీజేపీ పుంజుకుందని టీఆర్ఎస్ నేతలే చెప్తున్నారు.

హై లెవల్ లోనే సీట్లు కేటాయింపు

టీఆర్ఎస్ సీట్ల కేటాయింపులో చేసిన తప్పిదాలే ఆ పార్టీకి నష్టం చేశాయని కార్యకర్తలే అంటున్నరు. స్థానిక పరిస్థితులు, అభ్యర్థి పనితీరు, ప్రజలతో కార్పొరేటర్ కు ఉన్న సంబంధాలేవీ టికెట్లు ఇచ్చే విషయంలో పరిగణనలోకి తీసుకోలేదు. లోకల్ లీడర్ల మాటనూ కేర్ చేయలే. వ్యతిరేకత ఉన్న క్యాండిడేట్లకు సీటిస్తే ఓడిపోతాయని చెప్పినా చాలా చోట్ల క్యాండిడేట్లను మార్చలేదు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే కార్పొరేటర్ల సీట్లను ఎవరికీ ఇయ్యాలో డిసైడ్ చేశారు. ఇలా వారి మాట నెగ్గిన చోట క్యాండిడేట్ల గెలుపు కోసం కృషి చేశారు. జూబ్లీహిల్, సనత్ నగర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్భుల్లాపూర్, సికింద్రాబాద్  వంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే లు అడిగిన వారికే టికెట్లు దక్కాయి. ఎల్బీనగర్, ఉప్పల్, అంబర్ పేట్, ముషీరాబాద్ లో మాత్రం ఎమ్మెల్యేలను కాదని హై లెవల్ లో టికెట్లు కేటాయించారు. ఈ ఏరియాల్లోనే వరద ప్రభావం ఎక్కువ ఉండటం, అప్పటికే కార్పొరేటర్లపై వ్యతిరేకత తో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ క్యాండిడేట్లు ఓడిపోయారు.

ఎల్​బీనగర్‌లో చేదు అనుభవం

ఎల్​బీ నగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉంటే 2016 లో పదింట్లో టీఆర్ఎసే గెలిచింది. కానీ ఐదేళ్లలో వాళ్లపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో క్యాండిడేట్లను మార్చాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. ఆయన కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చారు. తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకోలేపోయారు. వ్యతిరేకత ఉన్న వాళ్లకే సీట్లు ఇవ్వటంతో ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. ఈ డివిజన్ లో 11కు స్థానాలను బీజేపీయే గెలిచింది. ముషీరాబాద్ లోనూ ఈ సారి టీఆర్ఎస్ 5 డివిజన్లలో ఓడిపోయింది. అంబర్ పేట్ లో మూడు సీట్లు  బీజేపీ గెలిచింది. సనత్ నగర్ లో మూడు టీఆర్ఎస్, మూడు బీజేపీ గెలిచింది. ఇక్కడ మంత్రి తలసాని ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ మూడు స్థానాల్లో బీజేపీ గెలవటానికి కార్పొరేటర్ల మీద ఉన్న వ్యతిరేకతే కారణం. అమీర్  పేట్, సనత్ నగర్ కార్పొరేటర్లు ఇంటి యాజమానుల నుంచి వసూళ్లకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నయి. అలాంటి వారికే తలసాని సీట్లు ఇప్పించి బీజేపీకి ప్లస్ చేశారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోని హబ్బిగూడ నుంచి ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి భార్య ఓడిపోయారు. ఉప్పల్ లో సిట్టింగ్ కార్పొరేటర్ పై అవినీతి ఆరోపణలు ఉండటంతో ఇక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచారు.  మొత్తంగా క్యాండిడేట్ల సెలక్షన్ సరిగా జరిగి ఉంటే టీఆర్ఎస్ సొంతంగా మేయర్ సీటును గెలుచుకునేదని ఆ పార్టీ కార్యకర్తలు చెబుతున్నరు. ప్రజల సమస్యలు తీర్చాల్సిన కార్పొరేటర్లే ప్రజలను కొత్త సమస్యలతో ఇబ్బంది పెట్టారంటున్నరు.

For More News..

ఐటీ కారిడార్​లో బీజేపీ బోణీ

గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో కరోనా కలకలం

మరో 2 నెలలు పాత పాలక మండలే