ఎన్నికల ఖర్చును తక్కువగా చూపేందుకు పక్క జిల్లాలో టీఆర్ఎస్ సభలు

మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలో ఎక్కువగా ఇంటింటి ప్రచారంపై ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్.. తాజాగా కులాలవారీ సమ్మేళనాలకు సిద్ధమవుతోంది. ఎన్నిక జరిగే నియోజకవర్గంలో పార్టీ ఎన్నికల ఖర్చును తక్కువగా చూపించేందుకు.. కోడ్ అమలులో లేని పక్క జిల్లా నియోజకవర్గంలో సభలకు ప్లాన్ చేస్తోంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మన్నెగూడలో ఓ ఫంక్షన్ హాల్ లో పెద్ద సభలు నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఇక్కడ ఈ నెల 15న మునుగోడు రైతు సన్నాహక సభ నిర్వహించగా.. శుక్రవారం చేనేత కార్మికుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని ప్లాన్  చేసింది. ఇకపై ఇదే వేదిక నుంచి ఇతర కుల సంఘాల సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిసింది. 

ఖర్చును చూపించాల్సి వస్తుందనే..

మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం నవంబర్ 1వ తేదీ వరకు నిర్వహించుకునే అవకాశముంది. దేశంలో గతంలో లాగా  ప్రస్తుతం కరోనా నిబంధనలు, జన సమీకరణపై ఆంక్షలు లేకపోయినప్పటికీ, నియోజకవర్గం బయట కోడ్ పరిధిలోకి రాని జిల్లాలో సభలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. మునుగోడులో సభల ఖర్చును ఎన్నికల ఖర్చులో చూపెట్టాల్సి రావడంతోనే వీలైనంత మేర బయట కూడా సభలు నిర్వహించి ఖర్చును తక్కువ చూపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే మునుగోడు, చండూరుకు 50, 60 కిలోమీటర్లు, చౌటుప్పల్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్నెగూడను వేదికగా ఎంచుకున్నట్లు తెలుస్తోంది .  

చేనేత కార్మికులతో మొదలు..

మునుగోడు నియోజకవర్గంలో బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. వీరిలో గొల్ల కురుమలు, గౌడ్స్​ సుమారు 35 వేలు..పద్మశాలి, ముదిరాజ్ లు 30 వేలకు పైగా, వడ్డెరలు 8 వేలు, కుమ్మరి, విశ్వ బ్రాహ్మణులు 7 వేల వరకు ఉంటారని అంచనా. తాము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బీసీ కులాల్లో టీఆర్ఎస్ కు పట్టు రావడం లేదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఆయా కులాల ముఖ్య నేతలను రప్పించి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే రైతులతో సభ నిర్వహించగా.. కులాలకు సంబంధించి శుక్రవారం చేనేత కుటుంబాలతో తొలి సమ్మేళనం ఏర్పాటు చేయబోతున్నారు. తర్వాత కులాల వారీగా సభలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.