సూర్యాపేట జిల్లా: కేసీఆర్ కుటుంబ అవినీతి తెలంగాణా ఎల్లలు దాటుతోందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ నేతల కుంభకోణాలు తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు పాకాయని.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అవినీతి జరిగిందని ప్రజలందరూ నమ్ముతున్నారని పేర్కొన్నారు. అక్రమాలు జరగకపోతే దర్యాప్తు సంస్థలు కవితను ఎందుకు పిలుస్తాయని ప్రశ్నించారు. సూర్యాపేట సబ్ జైల్ ని సందర్శించిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు, కోమరబండ మాజీ సర్పంచ్ రవిని ములాఖత్ లో కలిశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్నప్పుడు లేని తప్పు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోతే తప్పు కనిపిస్తుందా ? అని ప్రశ్నించారు. కేసీఆర్ స్థానిక పోలీసులతో చేస్తున్న వేధింపులే.. మోడీ దర్యాప్తు సంస్థలతో చేయిస్తున్నాడని మండిపడ్డారు. పోలీసులు టీఆర్ఎస్ నేతలకు బానిసల్లా ప్రవర్తిస్తున్నారని, రాష్ట్రంలో పోలీసు శాఖ దుర్వినియోగం అవుతోందన్నారు. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని.. కూలిపోయే ప్రభుత్వాన్ని చూసుకుని రెచ్చిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగం చేస్తున్న పోలీసులను ఎవ్వరినీ వదలమని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.