హరీశ్ మెడలో టీఆర్ఎస్ కండువా.. పార్టీ పేరు మారబోతోందా..?

హరీశ్ మెడలో టీఆర్ఎస్ కండువా.. పార్టీ పేరు మారబోతోందా..?
  •  సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
  •  మరో మారు యూటర్న్ పై చర్చ
  •  ఆరేళ్ల పాటు టీఆర్ఎస్ పేరు ఫ్రీజింగ్ లో పెట్టిన ఈసీ
  •  కమిషన్ అంగీకరిస్తేనే టీఆర్ఎస్, కారు గుర్తు?

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత కండువా మార్చారు. ఆయన మెడలో టీఆర్ఎస్ కండువా దర్శనమిచ్చింది. ఇవాళ పటాన్ చెరులో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి హరీశ్ రావు హాజరయ్యారు. ఆయన వెంట ఉన్న వాళ్లంతా బీఆర్ఎస్ కండువాలు ధరించగా హరీశ్ మాత్రం టీఆర్ఎస్ కండువా వేసుకున్నారు. బీఆర్ఎస్ పేరును మార్చబోతున్నారంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో కనిపించిన కండువా మరో మారు చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ రాష్ట్ర సమితిని గులాబీ బాస్ భారత రాష్ట్ర సమితిగా మార్చిన విషయం తెలిసిందే. పేరుమారిన తర్వాత జరిగిన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ బొక్క బోర్లాపడింది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల తర్వాత యూటర్న్ తీసుకొనేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రులు కూడా ఈ విషయాన్ని చెబుతూనే ఉన్నారు. 

తెలంగాణ రాష్ట్ర సమితి’పేరు ఇతరులకు కేటాయించకుండా ఎన్నికల సంఘం ఆరేళ్ల పాటు ఫ్రీజ్‌ చేసింది. తిరిగి టీఆర్‌ఎస్‌గా పేరు మారాలంటే ఎన్నికల సంఘం అంగీకరించాల్సి ఉంటుంది. అలా అయితేనే పార్టీ ఎన్నికల చిహ్నం ‘కారు గుర్తు’తిరిగి దక్కుతుంది. పేరు మార్పుకు అవసరమైతే పార్టీ నియమావళిని సవరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ అంశాలపై పార్టీ అధ్యయనం చేస్తోందని తెలుస్తోంది. అయితే ఈ తరుణంలో హరీశ్ రావు టీఆర్ఎస్ కండువా ధరించడం హాట్ టాపిక్ గా మారింది.