బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్..!

మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరనున్నారని తెలుస్తోంది. మునుగోడు టిక్కెట్ ఆశించిన ఆయన.. టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న బూర నర్సయ్య గౌడ్ బీజేపీ పెద్దలతో భేటీ అయినట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ తో బూర నర్సయ్య గౌడ్ భేటీ అయినట్లు తెలుస్తోంది. 

ఇవాళ రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో బూర నర్సయ్య గౌడ్ సమావేశంకానున్నారని సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఆయన త్వరలోనే కషాయ కండువా కప్పుకోనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరితే.. మునుగోడు ఉప ఎన్నిక వేళ టీఆర్ఎస్ కు పెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే మునుగోడులో రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. 

కొంతకాలం నుంచి అసంతృప్తిగా బూర నర్సయ్య 

2014లో టీఆర్ఎస్ పార్టీ నుంచి భువనగిరి ఎంపీగా బూర నర్సయ్యగౌడ్ గెలిచారు. తిరిగి 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ భువనగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సొంత పార్టీ నేతలే బూర నర్సయ్య గౌడ్ ను ఓడించారనే ప్రచారం జరిగింది. ఇదే విషయంపై పార్టీ అధిష్టానానికి కూడా బూర నర్సయ్యగౌడ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ప్రతీ సమయంలో తన వాయిస్ వినిపిస్తూ వచ్చారు. 

మునుగోడు టిక్కెట్ ఆశించిన బూర నర్సయ్య

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా  బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ టిక్కెట్ ఆశించారు. మునుగోడులో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారి ఓట్లు ఎక్కువగా ఉన్నాయని, ఆ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎక్కువగా ఓసీ నేతలే గెలిచారని.. ఈసారి TRS పార్టీ బీసీకే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. టికెట్ ఆశించడంలో కూడా తన గళం గట్టిగా వినిపించారు. మంత్రి జగదీష్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను పార్టీ మీటింగులకు పిలువడం లేదంటూ పార్టీ నాయకులు, కార్యకర్తల ఎదుట అసంతృప్తి వ్యక్తం చేశారు.