అంబర్ పేటపై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్

అంబర్ పేటపై టీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్

గ్రేటర్ ఎన్నికలతో హైదరాబాద్‌ రాజకీయంగా వేడెక్కింది. ఎక్కడ చూసినా కార్పొరేటర్ ఎన్నికల హడావుడే. కేవలం పది రోజుల్లోనే ఎన్నికలు ఉండటంతో ఒక్కసారిగా నగర వాతావరణం పూర్తిగా మారిపోయింది. గ్రేటర్‌లో మొత్తం 150 స్థానాలకు గాను అధికార టీఆర్ఎస్ పార్టీ 105 స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. మిగిలిన సీట్లను మిత్రపక్షమైన ఎంఐఎంతో పంచుకోనుంది. ఆ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ పోటీకి దిగనుంది. గత ఎన్నికల్లో మజ్లీస్ గెలుపొందిన 44 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ తన అభ్యర్థులను ప్రకటించింది. అయితే అది కేవలం పేరుకు మాత్రమే అన్నట్లుగా ఉంటుందనేది ఓపెన్ సీక్రెట్.

అయితే నగర నడిబొడ్డున ఉన్న అంబర్ పేట నియోజకవర్గంలోని ఏ ఒక్క డివిజన్‌కు కూడా టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించకపోవడం ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా ఉప్పల్ నియోజకవర్గంలో కూడా చాలా తక్కువ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించి.. మరికొన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఈ రెండు నియోజకవర్గాలలో అభ్యర్థుల్ని ప్రకటించకపోవడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. అంబర్ పేట నియోజకవర్గం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గంలో బీజేపీకి మంచి పట్టు ఉంది. ఎలాగైనా అక్కడ అయిదు డివిజన్లలోనూ తమ జెండా ఎగిరేయాలని టీఆర్ఎస్ చాలా పెద్ద వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. అక్కడ అన్ని స్థానాలను కైవసం చేసుకొని కిషన్ రెడ్డికి షాక్ ఇవ్వాలని టీఆర్ఎస్ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే ఆ నియోజకవర్గంలో మంచి పట్టున్న నాయకుల కోసం టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. అందుకే మొదటి లిస్టులో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ భార్య పద్మ పేరు కూడా ప్రకటించలేదు.

ఇక ఉప్పల్ నియోజకవర్గంలో కూడా చాలా స్థానాలకు అభ్యర్థుల్ని ఎంపిక చేయలేదు. అక్కడ కొన్ని ప్రాంతాలలో టీఆర్ఎస్‌కు వ్యతిరేక గాలి వీస్తుండటంతో అభ్యర్థుల్ని మార్చాలని టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. అంతేకాకుండా… ఈ నియోజకవర్గంలో బీజేపీకి మంచి క్యాడర్ ఉండటం కూడా టీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారింది. కాగా.. ఇక్కడ టీఆర్ఎస్ నుంచి భేతి సుభాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఆయన ప్రభావం గ్రేటర్ ఎన్నికల్లో ఎంతగా పనిచేస్తుందో చూడాలి.

For More News..

వీడియో : ఈ కుక్క తెలివి చూస్తే నవ్వకుండా ఉండలేరు

14 ఏళ్లకే వరల్డ్స్ టాలెస్ట్ టీనేజర్‌గా నిలిచిన బాలుడు

వీడియో: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. 12మందికి గాయాలు