- మునుగోడు ఎన్నికలు ముగిసినా ఆగని చేరికల పర్వం
- ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ఓటు బ్యాంకు బీజేపీకి కలిసివస్తాయనే భయం
- చేరికల కోసమే నియోజకవర్గానికి రూ. 10 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం
నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ క్యాడర్‌ను లక్ష్యంగా చేసుకొని రూలింగ్ పార్టీ ‘ఆపరేషన్ గులాబీ’కి తెరతీసింది. మునుగోడు ఉప ఎన్నిక నేర్పిన గుణపాఠం, కోమటిరెడ్డి బ్రదర్స్ రూపంలో పొంచి ఉన్న భయంతో బీజేపీ కన్నా ముందే అప్రమత్తం కావాలని హైకమాండ్ భావిస్తోంది. ఇందులో భాగంగా పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇప్పటికే రంగంలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి లీడర్లు, క్యాడర్ అనే తేడాలేకుండా ఎంతమంది వస్తే అంతమందిని చేర్చుకుంటున్నారు. ఇందుకోసం నియోజకవర్గానికి రూ.10 కోట్ల దాకా ఖర్చు పెడ్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఫలితంగా మునుగోడు ఎన్నికల టైంలో మొదలైన ఈ చేరికల పర్వం కొద్దిరోజులుగా మళ్లీ స్పీడందుకున్నది.
మునుగోడులో బెడిసికొట్టిన వ్యూహం
మునుగోడు ఎన్నికల్లో కాంగ్రెస్ఓటు బ్యాంకు తమకు కలిసొస్తుందని టీఆర్ఎస్లీడర్లు ఆశించారు. కానీ బీజేపీకి ఏకంగా 83 వేల ఓట్లు రావడంతో టీఆర్ఎస్ కంగుతిన్నది. ఈ ఫలితాలపై లోతుగా విశ్లేషించిన పార్టీ హైకమాండ్.. వచ్చే ఎన్నికల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత, కాంగ్రెస్ఓటు బ్యాంకు రెండూ బీజేపీకి తోడైతే కష్టాలు తప్పవని భావిస్తోంది. ఈక్రమంలోనే కాంగ్రెస్ లీడర్లు, ఓటర్లు బీజేపీ వైపు జారిపోకుండా ఇప్పటి నుంచే గ్రౌండ్వర్క్గట్టిగా చేయాలని జిల్లాలో ఆదేశించింది. రంగంలోకి దిగిన ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకొనేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ తప్పదని భావిస్తున్న ఆలేరు, సూర్యాపేట, నల్గొండ, నకిరేకల్, కోదాడ, మునుగోడు, మిర్యాలగూడెం, తుంగతుర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వలసలను ప్రోత్సహిస్తున్నారు. గులాబీ పార్టీలోకి వచ్చే కాంగ్రెస్లీడర్లకు భారీ నజరానాలు ముట్టచెబుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో సొంత పార్టీలో అసంతృప్తులను చల్లబర్చేందుకు నామినేటెడ్ పోస్టులు సైతం కట్టబెడుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో నకిరేకల్, తుంగతుర్తి, నల్గొండ, కోదాడ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమైన లీడర్లు, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరారు. సర్పంచులు, ఎంపీటీసీలను ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నారని కాంగ్రెస్నాయకులు మండిపడుతున్నా చేరికలు మాత్రం ఆగడం లేదు. పార్టీలో చేరికలను ప్రోత్సహించేందుకు నియోజకవర్గానికి రూ.10 కోట్లు చొప్పున ఖర్చు పెడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.
కోమటిరెడ్డి బ్రదర్స్భయం
టీఆర్ఎస్ఎమ్మెల్యేలకు కోమటిరెడ్డి బ్రదర్స్భయం కూడా పట్టుకుంది. రాజగోపాల్ రెడ్డి చరిష్మాతో మునుగోడులో బీజేపీ గట్టిపోటీ ఇచ్చింది. ఎన్నికల నాటికి ఆయన అన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరితే ఇక టీఆర్ఎస్కు కష్టకాలం తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బ్రదర్స్ఎఫెక్ట్ ఎంతలేదన్నా ఆరేడు నియోజకవర్గాలపై ఉంటుంది. మొదట్లో బ్రదర్స్టీఆర్ఎస్లోకి రాకుండా నిలువరించడంలో జిల్లా ముఖ్యనేతలు సక్సెస్ అయినప్పటికీ రాజకీయంగా ఎదుర్కోవడంలో మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఈ భయంతోనే కోమటిరెడ్డి బ్రదర్స్ముఖ్య అనుచరులు ఉన్న నియోజకవర్గాలపై ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. భారీ నజరానాలు, నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామని ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
కమ్యూనిస్టులతో ఒరిగేది కొంతే..
మునుగోడులో కమ్యూనిస్టులతో పొత్తు వల్లే ఆ పదివేల ఓట్ల మెజార్టీ లభించిందనే అభిప్రాయం కొంత వరకు ఉంది. ఈ పొత్తులు వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగే అవకాశాలు ఉండొచ్చని చెబుతున్నారు. కాకపోతే కమ్యూనిస్టుల ప్రభావం అన్ని నియోజకవర్గాల్లో లేకపోవడం టీఆర్ఎస్కు మైనస్. మరోవైపు పొత్తు పెట్టుకుంటే సీట్ల సర్దుబాటు అనివార్యమవుతుంది. దీనివల్ల టీఆర్ఎస్కు ఒనగూరే లాభం కంటే నష్టం ఎక్కువనే అభి ప్రాయం పార్టీ నేతల్లో ఉంది. ఒకవేళ పొత్తులు కొలిక్కి వచ్చినా.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీల్చకుండా కేవలం కమ్యూనిస్టులనే నమ్ముకుంటే బీజేపీయే లాభపడుతుందని పార్టీ సీనియర్ఎమ్మెల్యే ఒకరు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఓట్లను చీల్చే ప్రక్రియ ఇప్పటి నుంచి మొదలు పెడితేనే ఎన్నికల నాటికి పరిస్థితులు పూర్తిగా కంట్రోల్‌కి వస్తాయని ఆ ఎమ్మెల్యే చెప్పడం గమనార్హం.