- ఎప్పటికప్పుడు హైదరాబాద్కు రిపోర్ట్
- లైట్ తీసుకుంటున్న కొందరు లీడర్లు
- పగలు క్యాంపెయిన్.. రాజధానిలో నైట్ హాల్ట్
- ఎమ్మెల్యేలు, మంత్రులను భయపెడుతున్న ఖర్చులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రిని చండూరు మండలంలోని రెండు గ్రామాలకు ఇన్ చార్జీగా నియమించారు. మొదట కొద్ది రోజులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన.. ఈ నెల 17, 18 తేదీల్లో పత్తా లేకుండా పోయారు. దీంతో ఆయన అనుచరులే క్యాంపెయిన్ కొనసాగించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న నిఘా బృందం..మంత్రి రెండు రోజులు లేడనే విషయాన్ని హైదరాబాద్ కు ఈ నెల 19న 11 గంటలకు రిపోర్ట్ చేసింది. వెంటనే సదరు మంత్రికి పార్టీ యువ నేత ఫోన్ చేసి క్లాస్ పీకడంతో హుటాహుటిన గంటన్నరలో తనకు కేటాయించిన గ్రామాలకు చేరుకుని ప్రచారం మొదలుపెట్టాడు.
మునుగోడు నుంచి ప్రత్యేక ప్రతినిధి, వెలుగు : మునుగోడు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్..సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులనే నమ్మడం లేదు. ఎంపీటీసీ స్థానాలవారీగా క్లస్టర్లుగా విభజించి ఎమ్మెల్యేలు, మంత్రులను ఇన్ చార్జిలుగా నియమించిన ఆ పార్టీ అధిష్ఠానం..వారిపై తన వేగులతో నిఘా పెట్టింది. రోజూ ఎవరెవరు ప్రచారంలో పాల్గొంటున్నారు? ఎవరు పాల్గొనడంలేదన్న విషయాలను ఎప్పటికప్పుడు మధ్యాహ్నంకల్లా హైదరాబాద్ కు రిపోర్ట్ ఇస్తున్నాయి. చెప్పాపెట్టకుండ సొంత పనులపై ఎవరైనా లీడర్లు ఇంటి బాట పడితే వారికి పార్టీ అధిష్టానం నుంచి అంక్షింతలు తప్పడం లేదు.
రాత్రి కూడా అక్కడే ఉండాలె
స్వయంగా సీఎం కేసీఆరే మర్రిగూడ మండలం లెంకలపల్లిలో ప్రచార బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. రేపో, మాపో ఆయనే స్వయంగా వచ్చి ఈ గ్రామంలో ప్రచారం చేయనున్నారు. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికను కొందరు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు. ఉదయం, మధ్యాహ్నం ప్రచారం చేసి.. నైట్ హాల్ట్ కోసం హైదరాబాద్ చేరుకుంటున్నారు. పర్సనల్ పనులుంటే ఒక పూట లేదా రోజంతా అక్కడే ఉండిపోతున్నారు. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ పెద్దలు సీరియస్ గా ఉన్నట్లు తెలిసింది. అత్యవసరమైతే తప్పా నియోజకవర్గాన్ని వదిలి వెళ్లొద్దని, నైట్ హాల్ట్ పేరుతో హైదరాబాద్ రావడం మానుకోవాలని హుకూం జారీ చేసినట్లు తెలిసింది. ప్రచారం మరో 10 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో రాత్రి కూడా స్థానికంగా ఉండేందుకే ఏర్పాట్లు చేసుకోవాలని, గ్రామంలో అసంతృప్తులు, ముఖ్యులతో వ్యక్తిగతంగా మాట్లాడేందుకు ఈ టైంను వినియోగించుకోవాలని సూచించిటన్లు సమాచారం.
ఖర్చు తడిసి మోపెడు
మరో వైపు పార్టీ ఎన్నికల ఇన్ చార్జీలుగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రచార వ్యయం భయపెడుతోంది. ఇన్ చార్జీలుగా బాధ్యతలు అప్పగించిన గ్రామాల్లో అత్యధిక మెజార్టీ తీసుకురావాలని, దీన్నిబట్టే వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో టికెట్ల విషయంలో గీటురాయిగా ఉంటుందని ముందే చెప్పడంతో టెన్షన్ పడుతున్నారు. పార్టీ ఫండ్ కొంత మేర అందుతున్నప్పటికీ సగానికిపైగా ఇన్ చార్జీలే జేబులో నుంచి పెట్టుకోవాల్సి రావడంతో తలలు పట్టుకుంటున్నారు. తర్వాత అడ్జస్ట్ చేస్తామని హామీ ఇచ్చినా వారు నమ్మడం లేదని తెలిసింది. రోజూ క్యాడర్ తోపాటు జనాలకు చికెన్, మటన్, కోరిన లిక్కర్ కు అవుతున్న ఖర్చును చూసి నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న లీడర్లు, కొందరు యువ ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నట్లు తెలిసింది. తమ సొంత నియోజకవర్గంలో కూడా ఈ స్థాయిలో ఎప్పుడూ ఖర్చు పెట్టలేదని, ఇతర నియోజకవర్గం కోసం ఖర్చు చేయాల్సి వస్తోందని ఓ యువ ఎమ్మెల్యే వాపోయారు.