నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి పై పార్టీ వర్గాల్లో చర్చ
రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేల్లోనూ ఉత్కంఠ
సిట్టింగ్ ఎమ్మెల్సీ ‘పల్లా’నే మళ్లీ పోటీ చేస్తారనే ప్రచారం
కొత్త అభ్యర్థిని నిలబెడితే తలెత్తే పరిణామాల పైన తర్జనభర్జన
నియోజకవర్గాల్లో ఉధృతంగా సాగుతున్న ఓటరు నమోదు
నల్గొండ, వెలుగు: నల్గొండ, ఖమ్మం, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు..? అనే సస్పెన్స్ కొనసాగుతోంది. హైకమాండ్ ఆదేశాలతో ఓ టరు నమోదు కార్యక్రమాన్ని ఉధృతంగా సాగిస్తున్న ఎమ్మెల్యేలలోనూ ఇదే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం రూలింగ్ పార్టీ, ఎక్కడికక్కడ ఇన్చార్జిలను నియమించి గ్రామాల్లో, పట్టణాల్లో గ్రాడ్యుయేట్ల కోసం జల్లెడపడుతోంది. ఈక్రమంలో ఓటరు నమోదు చేపడుతున్న లీడర్లు, క్యాడర్‌కు ‘ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరు..?’ అనే ప్రశ్న గ్రాడ్యుయేట్ల నుంచి వస్తోంది. దీని పైన హైకమాండ్ కూడా క్లారిటీ ఇవ్వకపోడంతో మౌనంగా దాటవేస్తున్నారు. రెండు రోజుల క్రితం సీఎం కేసీఆర్ వద్ద జరిగిన మీటింగ్‌లో, అంతకుముందు ఓటరు నమోదు ప్రారంభానికి ముందు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్ద జరిగిన సమావేశంలోనూ అభ్యర్థి అంశం పైనే చర్చ జరిగినట్లు తెలిసింది. కానీ ఇప్పటి వరకు హైకమాండ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పార్టీ వర్గాల్లో మా త్రం సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డినే మళ్లీ నిలబెడతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పల్లా అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న కొందరు నేతలు మాత్రం కొత్త అభ్యర్థి అయితే బాగుండనే అభిప్రాయాన్ని వ్యక్తం చే స్తున్నారు. ఈక్రమంలో కొత్త అభ్యర్థిని నిలబెడితే తలెత్తే పరిణామాల పై హైకమాండ్ తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం.
అభ్యర్థి పై వేచిచూసే ధోరణి..
గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్న టీజేఎస్, యువ తెలంగా ణ పార్టీ, తెలంగాణ ఇంటిపార్టీ, సీపీఐ నేతలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించి ఓటరు నమోదు చేపట్టారు. ఇన్నాళ్లూ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా వల్ల గ్రాడ్యుయేట్లకు ఒరిగిందేమీ లేదని ప్రచారం చేస్తున్నారు. దీంతో గ్రాడ్యుయేట్ల నాడి అర్థం కాని టీఆర్ఎస్ హైకమాండ్ తన అభ్యర్థిపై ఆచితూచి అడుగులు వేస్తోంది. గ్రాడ్యుయేట్లలో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందనే విషయాన్ని పసిగట్టడం వల్లే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేరును ప్రకటించేందుకు తర్జనభర్జన పడుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత అనుభవాలతో విపక్ష పార్టీల కంటే ముందుగానే అలర్ట్ అయ్యి ఓటరు నమో దు చేపడుతున్న టీఆర్ఎస్, అభ్యర్థిని ప్రకటించే విషయంలో వేచిచూసే ధోరణి అవలంబిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త అభ్యర్థికి అవకాశం ఇవ్వకుండా మళ్లీ పల్లానే నిలబెట్టాలనే ఆలోచనలో హైకమాండ్ ఉన్నట్లు లీడర్ల టాక్.
ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత..
ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లా టీఆర్ఎస్ లీడర్లు, ఎమ్మెల్యేల్లో పలువురు పల్లాకు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తున్నారు. హైకమాండ్‌కు నమ్మినబంటుగా ఉన్న పల్లా రాజకీయంగా పట్టుసంపాధించేందుకు నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తలదూర్చారని మొదటి నుంచీ అనుమానిస్తున్నారు. ఈ ఏడాది డీసీసీబీ చైర్మన్ ఎంపికలో పల్లా వ్యవహరిం చిన తీరు నల్గొండ జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు కోపం తెప్పించింది. గతేడాది జరిగిన హుజూర్నగర్ ఉప ఎన్నికలు, నల్గొండ మున్సిపల్ చైర్మ న్ ఎన్ని క బాధ్యతలు కూడా హైకమాండ్ పల్లాకే అప్పగించింది. దీంతో జిల్లాలో పల్లాకు బలం పెరుగుతుందనేది అక్కడి నేతల భావన. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లానే నిలబెట్టాలనే ఆలోచన హైకమాండ్ కు ఉన్నప్పటికీ ఇప్పటికిప్పుడు ప్రకటిస్తే దాని రిజల్ట్ మరోరకంగా ఉంటుందనేది పార్టీ ఆలోచన.