
సారుకు, ఢిల్లీల సర్కారుకు నడుమ పదహారు నంబరుంది .అసెంబ్లీ జోష్ తోని ఎంపీ ఎన్నికల్ల 16 సీట్లు గెల్చుడు కష్టంగా దని గులాబీ పార్టీ నమ్ముతున్నది. క్యాండేట్లు ఎవళ్లయినా కేసీ ఆర్ ఫేస్ జూసే ఓటెయ్యాలని అడుగుతున్నది. గులాబీ పార్టీ టార్గెట్ కొడ్తదా? సిచువేషన్ పాతలెక్కనే ఉందా? ఎమ్మె ల్సీ ఎన్నికల కాడ్నుం చి పొలిటికల్ సీన్ ఎట్ల మారింది ? కారు జోరు, తీరు ప్లస్సు మైనస్ ల లెక్కలెట్లున్నయ్?
ప్లస్ లు
- అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఒంటిచేత్తో గెలిపించిన కేసీఆర్ చరిష్మానే ఈసారీ గెలిపిస్తుందన్న నమ్మకం. అభ్యర్థి ఎవరన్నది కాకుండా సారు, కారుకే ఓటేయాలన్న పార్టీ నేతల ప్రచారం.
- నాలుగునెలల కిందే అసెంబ్లీలో 88 సీట్లు సాధించిన హవాతో అవే ఫలితాలు రిపీట్ అవుతాయన్న ధీమా. ఇటీవల పంచాయతీల్లోనూ ఎక్కువ భాగం టీఆర్ఎస్ మద్దతుదారులే గెలవడం.
- సర్కారు పథకాల ప్రయోజనం పొందిన ఓటర్లు లోక్ సభ ఎన్నికల్లోనూ మళ్లీ ఓటేస్తారన్న నమ్మకం. కేసీఆర్ ప్రచారంలో ఇదే అంశాల ప్రస్తావన.
- త్వరలో రెట్టింపు కాబోతున్న పెన్షన్లు, పెరగనున్నరైతుబంధు సాయం ఓటర్లను ఆకర్షించే అవకాశం.
- కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో సగం మందిపైగా టీఆర్ఎస్లోకి రావడం, ఇతర నాయకుల వలసలతో పెరిగిన బలం.
- కేంద్రంలో చక్రం తిప్పడం ద్వారా రాష్ట్రానికి మేలు చేయచ్చని..కేటీఆర్ సీఎం, కేసీఆర్ పీఎం అవుతారని నేతల ప్రచారం.
- ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ లోముఖ్య నేతల మధ్య సమన్వయ లోపం. విపక్షంలో రాజకీయ శూన్యత వల్ల ఏకపక్షంగాఫలితాలు ఉంటాయన్నఅంచనా.
- హంగూ ఆర్భాటాలతో అధికార పార్టీ అభ్యర్థులు చేస్తున్న కార్యక్రమాలకు దీటుగా ప్రచారం చేయగలిగే పరిస్థితిలో ప్రతిపక్ష అభ్యర్థులు లేకపోవడం.
మైనస్ లు
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ మద్దతిచ్చిన ముగ్గురు నేతల ఓటమి. టీచర్లు,గ్రాడ్యుయేట్లలో బయటపడ్డ అసంతృప్తి.
- స్థానిక ఉద్యమకారులను కాదని పెద్దగా పరిచయంలేని కొత్త ముఖాలను అభ్యర్థులుగా నిలబెట్టడం. డబ్బులున్న వారిని ఎన్నికల్లోకి దించారన్న విమర్శలు.
- నిజామాబాద్ లో పసుపు,ఎర్రజొన్న రైతుల వ్యతిరేకత.ఎన్నికల్లో భారీ సంఖ్యలో నామినేషన్లు. అన్ని పార్టీలను దూరం పెట్టి స్వచ్ఛందంగా ఉద్యమం.
- రెవెన్యూ ఉద్యోగుల గురించిసీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై వారిలో అసంతృప్తి.
- జాతీయస్థాయి ఎన్నికల్లో రాష్ట్ర అంశాల ప్రభావం తక్కువగా ఉండడం ప్రతిపక్ష ఎమ్మెల్యే లను వరుసపెట్టి పార్టీలో చేర్చుకుంటూ విపక్షమే లేకుండా చేస్తున్నారని విద్యావంతుల వర్గాల్లో ఆందోళన.
- ఎమ్మెల్యే లుపార్టీ మారడంపై పలు చోట్ల స్థానికంగా వ్యతిరేకత. అసెంబ్లీ ఎన్నికల టైంలో అకౌంట్లలో వేసిన రెండో విడత రైతుబంధు సొమ్ము చాలామందికి అందకపోవడం.
- నేతల వ్యాఖ్యల వివాదం. ఓటేయకపోతే జిల్లా కేంద్రం పోతుందన్న మంత్రి మాటలతో కలకలం. టీఆర్ఎస్ కు ఓటేయకపోతే జనాన్ని కుక్కలు కూడా చూడవన్న మాజీ మంత్రి తుమ్మల కామెంట్లు.
అసెంబ్లీ ఎన్నికల జోష్ లో ఉన్న అధికార పార్టీ లోక్ సభ ఎన్నికల్లోనూ గెలుపుపై ధీమాగా ఉంది. అదే హవా కొసాగుతుందని నమ్ముతోంది. రాష్ట్రంలో 16 సీట్లను స్వీప్ చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ గెలుపుతో కేంద్ర ప్రభుత్వం లో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని ప్రచారం చేస్తోంది. నేతల వలసలతో విపక్షం బలహీనపడడం తమకు తిరుగులేని విజయాన్ని తెచ్చిపెడుతుందని భావిస్తోంది.ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన పరిస్థితులు, కొ న్ని వారాలుగా జరుగుతున్న పరిణామాలు అధికార పార్టీకి సవాలు విసురుతున్నాయి.గెలుపు కోసం కొంత కష్టపడాల్సి న వాతావరణం కల్పిస్తున్నాయి.
ఆల్ ఇన్ వన్ సారు
అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటిచేత్తో టీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తెచ్చిన కేసీఆరే ఈ ఎన్నికల్లో కారుకు ఏకైక బ్రాండ్ అంబాసిడర్. దీంతో అభ్యర్థుల సొంత బలం కంటే కేసీఆర్ ను చూసే జనం ఓటేస్తారన్నది పార్టీ ధీమా. అందుకే సగానికి పైగా సీట్లలో సిట్టింగ్ లు, సీనియర్లను పక్కనబెట్టి కొత్త అభ్యర్థులతో ప్రయోగం చేస్తున్నారు కేసీఆర్. తానే అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు సాధించిన టీఆర్ఎస్ తర్వాత చేరిన విపక్ష ఎమ్మెల్యే లతో కలిపి సెంచరీ కొట్టిం ది. దీనికి తోడు పంచాయతీ ఎన్నికల్లో చాలా గ్రామాల్లో టీఆర్ఎస్ మద్దతిచ్చినవారే గెలవడంతో పార్టీ పట్టు పెరిగిం ది. ఇవన్నీ కలిసొచ్చి అసెంబ్లీ ఫలితాలను రిపీట్ చేస్తామని భావిస్తోంది.అదే సమయంలో కారును గెలిపించిన సంక్షేమ పథకాలతో పాటు వాటిని పెంచి ఇవ్వబోతున్నామని కేసీఆర్ ప్రచారంలో గుర్తుచేస్తున్నారు. విపక్ష నేతల చేరికతో బలం పెరగడంతో పాటు వలసలతో ప్రతి పక్షం బలహీనపడడం కలిసొస్తుందని గులాబీ పార్టీ భావిస్తోంది. మరోవైపు అన్ని వనరులూ ఉన్న అధికార పార్టీ అభ్యర్థులు విస్తృ తంగా ప్రచారం సాగిస్తున్నారు.అదే స్థాయిలో ప్రచారం చేయగలిగే పరిస్థితిలో విపక్ష అభ్యర్థులు లేకపోవడంతో ఏకపక్షంగా 16 సీట్లు గెలుస్తామని టీఆర్ఎస్ నమ్ముతోం ది. అన్ని సీట్లూ గెలిస్తే కేంద్రంలో కీలకపాత్ర పోషిం చే అవకాశం కేసీఆర్ కు వస్తుందన్న ప్రచారం జనాన్ని ఆకర్షిస్తుం దని అంచనా వేస్తోంది.
అయినా ఎందుకిలా?
ఎంత ధీమాగా ఉన్నా టీఆర్ఎస్ నేతలను కొన్ని అంశాలు ఇబ్బంది పెడుతున్నాయి. అసెంబ్లీ ఫలితాలు తెచ్చిన విశ్వాసాన్ని ఇటీవలి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కొంత దెబ్బతీశాయి. కొన్నేళ్లు గా వరుస విజయాలతో ఎదురులేకుండా సాగిన టీఆర్ఎస్ కు మొదటిసారి గట్టి ఎదురుదెబ్బ ఇది. ఆపార్టీ మద్దతిచ్చిన ముగ్గురు నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలయ్యారు. శాసనమండలి టీఆర్ఎస్ చీఫ్ విప్ గా ఉన్న పాతూరి సుధా కర్ రెడ్డి,మరో పార్టీ నేత పూల రవీం దర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయారు. వారికి కనీసం రెండో స్థానం కూడా రాకపోవడం గులాబీ నేతలకు షాకిచ్చింది.మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటులో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్ డి 39 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. టీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లా ల్లో గ్రాడ్యుయేట్ ఓటర్లలో కనీసం గట్టి పోటీ ఇవ్వలేకపోవడం కారు నేతలను ఆలోచనలో పడేసిం ది. ఇటు టీచర్లు, అటు గ్రాడ్యుయేట్ల ఆలోచనలో వచ్చిన మార్పు ప్రభావం ఎంపీ ఎన్నికల్లో ఎలా ఉంటుం దన్నది వారికి ఆందోళన కలిగిస్తోంది. ఇక ఎంపీ బరిలో దించి న కొ త్త అభ్యర్థులు ఓటర్లకు ముఖ పరిచయం కూడా లేనివాళ్లు కావడంతో ప్రచార భారాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు మోస్తున్నారు. స్థాని క ఉద్యమకారులను పక్కనబెట్టి డబ్బు లున్నవారికే టికెట్లిచ్చా రన్న విమర్శలు అధికార పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి. అటు విపక్షాల నుంచి వరుసగా ఎమ్మెల్యే లు అధికార పక్షంలో చేరడంతో అసలు గళం వినిపించే ప్రతిపక్షమే లేకుండా చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. దీనికి సంకేతమే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో కొందరు టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి.