రాజగోపాల్ రెడ్డి అనుచరులను టార్గెట్ చేసిన టీఆర్ఎస్

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులను అధికార పార్టీ టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి అనుచరులను పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. చండూరు పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త వెంకటేష్ యాదవ్, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకన్న ఇళ్ల వద్ద రాత్రి 11 గంటల వరకూ పోలీసులు హల్ చల్ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని కొందరు స్థానికుల ద్వారా తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు..రాజగోపాల్ రెడ్డి అనుచరుల ఇండ్ల వద్దకు చేరుకున్నారు. స్థానికులు అడిగిన ప్రశ్నలకు మఫ్టీలో ఉన్న పోలీసులు పొంతన లేని సమాధానాలు ఇచ్చారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 

మరోవైపు.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులను కిడ్నాప్ చేసేందుకు పోలీసు యంత్రాంగం కుట్రలు పన్నిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే అధికార పార్టీ నాయకులే బాధ్యత వహించాలని రాజగోపాల్ రెడ్డి అనుచరులు హెచ్చరిస్తున్నారు. గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త వెంకటేష్ యాదవ్, ఎంపీటీసీ వెంకన్న వంటి నాయకులు పార్టీ మారాలంటూ అధికార పార్టీ నాయకులు గత వారం రోజులుగా ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి అనుచరులు అధికార పార్టీ నాయకుల మాటలు వినకపోవడంతోనే పోలీసులను రంగంలోకి దింపారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

హోరాహోరీగా ప్రచారం

మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 47మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుండగా, 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు. టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి, టీ‌జే‌ఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ బరిలో ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు కీలకంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికలో విజయం సాధిస్తే, రాబోయే ఎన్నికలపైనా ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడును సీటును గెలుచుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారంలో మరింత స్పీడు పెంచాయి.