మెదక్/ శివ్వంపేట, వెలుగు: నర్సాపూర్ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకుల్లో అసంతృప్తి పెరుగుతుండడంతో అధికార టీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గతేడాది చిలప్‌చెడ్ జడ్పీటీసీ మెంబర్ చిలుముల శేష సాయిరెడ్డి పదవికి, టీఆర్ఎస్పార్టీకి రాజీనామా చేయగా, ఇటీవల నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ఎర్రగొళ్ల మురళీ యాదవ్ పార్టీ హైకమాండ్, సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయగా అతడిని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ పార్టీ, ప్రభుత్వం తీరుపై బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేయగా, నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన చాలా మంది ప్రజాప్రతినిధులు, పార్టీ లీడర్లు అభివృద్ధి పనులకు ఫండ్స్ కేటాయింపు, నామినేటెడ్పదవులు ఇవ్వకపోవడం లాంటి విషయంలో పార్టీపై అసంతృప్తితో రగులుతున్నారు.
మురళీయాదవ్ బాటలో మరికొందరు..
నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్, టీఆర్ఎస్పార్టీ సీనియర్ లీడర్మురళీ యాదవ్ పార్టీకి దూరం కాగా, ఇదే పట్టణానికి చెందిన పలువురితో పాటు, ఇతర మండలాలకు చెందిన మరికొందరు లీడర్లు ఆయన బాటలో పయనించే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. ఇంటలిజెన్స్‌వర్గాల ద్వారా ఈ విషయాన్ని పసిగట్టిన అధికార పార్టీ అలర్ట్అయ్యింది. నర్సాపూర్ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి రంగంలోకి దిగి నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న టీఆర్ఎస్ప్రజా ప్రతినిధులు, లీడర్లు ఎవరెవరు ఉన్నారనేది ఆరా తీస్తున్నారు. అలాంటి వారు ఎవరూ పార్టీని వీడి వెళ్లకుండా బుజ్జగింపులు మొదలు పెట్టారు. నారాజ్‌గా ఉన్నవారితో ఎమ్మెల్యే స్వయంగా మాట్లాడుతున్నారు.
కేసీఆర్ మాట్లాడాల్సిన పరిస్థితి..
టీఆర్ఎస్పై మురళీయాదవ్ ఆరోపణలు చేసిన మరుసటి రోజే ఎమ్మెల్యే మదన్ రెడ్డి శివ్వంపేట, నర్సాపూర్, కౌడిపల్లి మండలాలకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను ప్రగతి భవన్ కు తీసుకు వెళ్లి సీఎం కేసీఆర్‌తో మాట్లాడించారు. అదే రోజు శివ్వంపేటకు చెందిన పార్టీ సీనియర్ నాయకుడితో కేసీఆర్స్వయంగా ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం. ఎవరూ అసంతృప్తి చెందొందని, ఇచ్చిన హామీలు అమలయ్యేలా చూస్తామని, అభివృద్ధి పనులకు ఫండ్స్ శాంక్షన్చేస్తామని, పార్టీలో, పదవుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇస్తున్నారు. తద్వారా ఎవరూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా, పార్టీనీ వీడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అసంతృప్తితో ఉన్న నాయకులు ఈ బుజ్జగింపులతో వెనక్కు తగ్గుతారా? లేదా ఇతర పార్టీలో చేరుతారా? అన్నది వేచి చూడాల్సిందే.