టీఆర్ఎస్​ విజయం ఎప్పుడో ఖాయమైంది : కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి

  • చేసింది చెప్పుకునేందుకే ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రచారం
  • ‘వెలుగు’ ఇంటర్వ్యూలో మునుగోడు టీఆర్​ఎస్​ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి

నల్గొండ, వెలుగు : గత ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించడం వల్లే మునుగోడు అభివృద్ధి ఆగిపోయిందని, ఈసారి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే.. నియోజకవర్గంలో ఆగిపోయిన పనులన్నీ మొదలుపెడ్తామని మునుగోడు టీఆర్ఎస్​ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో జనం తమకు బ్రహ్మరథం పడ్తున్నారని, టీఆర్ఎస్​ విజయం ఎప్పుడో ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ‘వెలుగు’కు కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ఆయన ఏమన్నారంటే..

మా వెంటే జనం

మునుగోడులో టీఆర్ఎస్​ ప్రచారం బ్రహ్మాండంగా సాగుతున్నది. ఏ ఊరికి వెళ్లినా ప్రజలు స్వచ్ఛందంగా స్వాగతం పలుకుతున్నరు. బోనాలు, బతుకమ్మలు, కోలాటాలతో ఎదుర్కోళ్లు ఉంటున్నయ్​. జనాల ముఖాల్లో ఆనందం చూస్తుంటే టీఆర్​ఎస్​పై ఎంతటి అభిమానం ఉందో అర్థమైతున్నది. మా విజయం ఇప్పటికే ఖాయమైంది. కాంగ్రెస్, బీజేపీ సెకండ్ ప్లేస్ కోసం కొట్లాడుతున్నయ్. ఆ రెండు పార్టీల్లో ఎవరు ప్రధాన ప్రత్యర్థి అంటే చెప్పడం కష్టం. పోటీలో ఉన్న  ప్రతి ఒక్కరూ నాకు ప్రత్యర్థులే. 

ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నందుకే అభివృద్ధి ఆగింది

గతంలో ఏ ప్రభుత్వం చేయనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను రాష్ట్రమంతా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్నది. నేను 2014 నుంచి 2018 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన.  ప్రధాన రోడ్లతోపాటు గ్రామాల్లో అంతర్గత రోడ్లు, మండలాలకు లింక్ రోడ్లు, మిషన్ భగరీథ పనులు చేపట్టినం. సాగు నీటి సమస్యకు తీర్చేందుకు రూ. 2 వేల కోట్లతో చర్లగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్లు చేపట్టినం. 2018లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలవడం వల్లే  అభివృద్ధి ఆగిపోయింది. ఈ విషయాన్ని మా ప్రత్యర్థులే చెప్తున్నరు. తాము ప్రతిపక్షంలో ఉన్నందువల్లే నిధులు రాలేదని అంటున్నరు. ఆగిపోయిన పనులను మొదలు పెట్టాలన్నా, పెండింగ్ పనులు, ముఖ్యంగా ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా  టీఆర్ఎస్ ​గెలవాలి.  

కాంట్రాక్టు కోసమే రాజగోపాల్​ రాజీనామా

ఈ ఉప ఎన్నిక రావడం బీజేపీ చేసిన కుట్ర. రాజగోపాల్ రెడ్డికి 18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి బలవంతంగా రాజీనామా చేయించిన్రు. ఈయన కూడా 18 వేల కోట్లకు ఆశపడి ఈ ఎన్నికకు కారణమైండు. నియోజకవర్గంపై వివక్ష అనేది ఎక్కడా లేదు. రాష్ట్రమంతా ఇచ్చినట్లుగానే ఇక్కడ కూడా ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి, రైతుబంధు ఇస్తనే ఉన్నం. కాకపోతే అభివృద్ధి విషయంలో రాజగోపాల్ రెడ్డి ఏ ఒక్కరోజు కూడా సంబంధిత మంత్రులతోగానీ, అధికారులతోగానీ సమీక్ష చేయలేదు. అసలు ఆయన ఈ ప్రాంతంలో తిరగలేదు. ఈ ప్రాంత సమస్యలపై ఆయనకు అవగాహన లేదు. గెలిచినప్పుడు తప్పితే మళ్లీ ఇప్పుడు ఎన్నికలు వచ్చినయని నియోజకవర్గంలో తిరుగుతున్నడు. మూడున్నరేండ్లుగా జనాలకు అందుబాటులో లేని ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నరంటే అది రాజగోపాల్ రెడ్డి మాత్రమే. 

అందుకే ఇంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు..

ఒక్క రాజగోపాల్​రెడ్డి కోసం 86 మంది ఎమ్మెల్యేలు, 15 మంది మంత్రులను దింపిన్రని ప్రచారం చేసుకుంటున్నరు. మా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అట్లున్నయ్​. వాటి గురించి ప్రజలకు చెప్పుకునేందుకు వాళ్లంతా వస్తున్నరు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రావట్లేదా? మేం ఒక రాజకీయ పార్టీగా ఏ టైంలో ఎట్ల వ్యవహరించాలో అట్లనే వ్యవహరిస్తం. అది ఢిల్లీ అయినా.. గల్లీ అయినా అట్లనే ఉంటది. చిన్న పామును అయినా పెద్ద కట్టెతో కొట్టాలన్నది తెలిసిందే కదా!

ఆదరణను తట్టుకోలేకే ఆరోపణలు

ప్రజల్లో మాకు వస్తున్న ఆదరణను తట్టుకోలేకే లీడర్లను కొంటున్నట్లు, ఓటర్లకు డబ్బు, మద్యం పంచుతున్నట్లు ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు చేస్తున్నయ్​. డబ్బు, మద్యం పంచేది ఎవరో మునుగోడు ప్రజలకు తెలుసు. కాంగ్రెస్​లో ఉన్నప్పుడు ఆ  సంస్కృతి కొనసాగించిన వ్యక్తే, ఇప్పుడు  బీజేపీలోకి వచ్చినంక కొనసాగిస్తున్నడు. లిక్కర్​ను, పైసలను నమ్ముకొని ఎన్నికలకు పోతున్నరు. ఎంతసేపు కేసీఆర్  కుటుంబాన్ని తిట్టడం తప్ప తాను ఎమ్మెల్యేగా గెలిచినంక మునుగోడుకు ఏమి చేశాడో రాజగోపాల్​రెడ్డి చెప్పుకోలేకపోతున్నరు. కానీ మేము చెప్పుకునేందుకు మిషన్​భగీరథ, రైతుబంధు, రైతుబీమా, దళిత బంధు, గిరిజన బంధు, కల్యాణ లక్ష్మి లాంటి ఎన్నో పథకాలు ఉన్నయ్.