4.5% ఓట్ల తేడాతో టీఆర్ఎస్​ గెలుపు

  • 4.5% ఓట్ల తేడాతో టీఆర్ఎస్​ గెలుపు
  • మునుగోడు ఉప ఎన్నికలో గట్టెక్కిన కూసుకుంట్ల
  • అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్​
  • 16 మంది మంత్రులు, 86 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు నెల రోజులు మకాం వేసినా ఫలితం అంతంతే
  • కమ్యూనిస్టులతో జత కట్టినా.. ప్రలోభాలకు దిగినా టీఆర్​ఎస్​కు పెద్దగా దక్కని మెజార్టీ
  • 6 శాతం నుంచి 38 శాతానికి పెరిగిన బీజేపీ ఓటు బ్యాంకు
  • సిట్టింగ్​ సీటు కోల్పోయి మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్

హైదరాబాద్, వెలుగు: ఉత్కంఠ రేపిన మునుగోడు ఉప ఎన్నికలో అధికార పార్టీ  స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కింది. రాష్ట్రంలోని 16 మంది మంత్రులు,  86 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు అంతా ఇరవై, ఇరవై ఐదు రోజులు అక్కడే మకాం పెట్టి గడప గడపకు తిరిగినప్పటికీ.. టీఆర్​ఎస్ అనుకున్నంత మెజారిటీ సాధించలేకపోయింది. 10,309 ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్​రెడ్డి విజయం సాధించారు. వరుసగా దుబ్బాక, హుజూరాబాద్​ ఎలక్షన్ల ఓటమి షాక్​లో ఉన్న టీఆర్​ఎస్  ఈ ఫలితంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. కాంగ్రెస్​కు రాజీనామా చేసి బీజేపీ తరఫున పోటీకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి అధికార పార్టీని బలంగా ఢీకొన్నారు. టీఆర్​ఎస్​ బలగమంతా మునుగోడులోనే  తిష్టవేసినప్పటికీ.. ఆయన చివరి వరకూ పోరాడారు. తన పాత ప్రత్యర్థి, టీఆర్​ఎస్​ అభ్యర్థి ప్రభాకర్​రెడ్డిపై నాలుగున్నర శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాజగోపాల్​రెడ్డి 86,697 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. వరుసగా వచ్చిన ఎన్నికలతో రాష్ట్రంలో బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పుంజుకుంది. 

దుబ్బాక, హుజూరాబాద్​ బై ఎలక్షన్లలో గెలిచిన బీజేపీ.. మునుగోడులోనూ గట్టి పోటీ ఇచ్చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గంలో 6% ఉన్న బీజేపీ ఓటు బ్యాంకు 38.38 శాతానికి పెరిగింది. ఉత్తర తెలంగాణలో పట్టున్న బీజేపీ ఈసారి దక్షిణ తెలంగాణలోనూ సత్తా చాటిందనే  చెప్పుకోవాలి. ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఈ ఎన్నికను సవాల్​గా తీసుకోవటంతో ఇతర పార్టీల ఓటు బ్యాంకు చెల్లాచెదురైంది. సిట్టింగ్​ సీటును కోల్పోయిన కాంగ్రెస్​ మూడో స్థానానికే పరిమితమైంది. మహిళా అభ్యర్థిని పోటీకి దింపినప్పటికీ డిపాజిట్​ను  కాపాడుకోలేక పోయింది. కాంగ్రెస్​ అభ్యర్థి పాల్వాయి స్రవంతి 23,906 ఓట్లు సాధించారు. కాంగ్రెస్​కు వచ్చిన ఓట్లు ప్రధాన పార్టీల గెలుపోటములపై ఎఫెక్ట్  చూపాయనే విశ్లేషణలున్నాయి.  

ప్రలోభాలు, బెదిరింపులు

దుబ్బాక, హుజూరాబాద్​ వరుస ఓటములతో షాక్​ లో ఉన్న టీఆర్​ఎస్​ మునుగోడులో ముందుగానే అప్రమత్తమైంది. పొత్తులతో పాటు అధికారాన్ని ప్రయోగించింది. సీపీఐ, సీపీఎంతో పొత్తుతో పోటీలోకి దిగింది.  బై ఎలక్షన్​ షెడ్యూల్​ వచ్చిన  వెంటనే ప్రభుత్వం మునుగోడులో పెండింగ్​లో ఉన్న పనులకు ఫండ్స్​ రిలీజ్​ చేసింది. గట్టుప్పల్​ను మండలంగా ప్రకటించటం మొదలు.. గొర్రెల పంపిణీ స్కీమ్​ను నగదు బదిలీగా మార్చడం, ఆర్టీసీ కార్మికులకు డీఏ,  ఉద్యోగులకు ఒకటో తారీఖునే జీతాలు వేయడం.. హైదరాబాద్​లో ఉంటున్న వలస ఓటర్లకు రాత్రికి రాత్రి ఇండ్ల స్థలాల రెగ్యులరైజేషన్​ జీవో ఇవ్వడం.. వంటి ఎన్నో ప్రలోభాలకు దిగింది. తమకు ఓటు వేయకుంటే అమలులో ఉన్న స్కీమ్​లు బంద్​ చేస్తామని, పనులు ఆగిపోతాయని సాక్షాత్తు మంత్రులు కూడా బెదిరింపులకు పాల్పడటం మునుగోడు ఫలితాలను ప్రభావితం చేసినట్లయిందని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన పార్టీల పోటాపోటీ ఖర్చులతో ఈ బై ఎలక్షన్ దేశంలోనే​ అత్యంత కాస్ట్ లీ ఎలక్షన్​ను తలపించింది. నియోజకవర్గంలో భారీ ఎత్తున మద్యం, మనీ పంపకాలు జరిగాయి. ఓటర్లకు స్వయంగా లీడర్లే  మందు పోశారు. ప్రత్యేక బస్సుల్లో టూర్లకు తీసుకుపోయారు. ఆత్మీయ సమ్మేళనాల పేరిట రోజూ ఏదో ఒక చోట దావతులు ఏర్పాటు చేశారు. పోలీసులు, అధికార యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశాయని, టీఆర్​ఎస్​ లీడర్లు యథేచ్ఛగా డబ్బులు తరలిస్తున్నా, ఓటర్లకు పంచి పెడుతున్నా చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఇలా ప్రలోభాలు పెట్టడం, బెదిరింపులకు గురిచేయడంతో చివరికి అతికష్టమ్మీద టీఆర్​ఎస్​ గెలిచిందని అంటున్నాయి. మునుగోడులో గెలుపుతో ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు టీఆర్​ఎస్ ఖాతాలో పడ్డట్లయింది.