కేసీఆర్ ను తిడితే కాదు.. పని చేస్తే ఓట్లు వస్తయి: కేటీఆర్

హైదరాబాద్: కేసీఆర్ ను తిడితే ఓట్లు రావని.. ప్రజల కోసం పని చేస్తే ఓట్లు వస్తాయని రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేసిందో ఏంటో చెప్పి మునుగోడులో ఓట్లు అడగాలని బీజేపీకి సవాలు విసిరారు. గురువారం తెలంగాణ భవన్ లో  ఆలేర్ మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్  మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా భిక్షమయ్య గౌడ్ కు గులాబీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీని తీవ్రంగా విమర్శించారు. మోడీ దేశానికి ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ వంటి సంస్థలను బీజేపీ ప్రభుత్వం తమ స్వార్ధానికి వాడుకుంటోందని ఫైర్ అయ్యారు. దేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడవడంలేదని... మోడీ రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. గ్యాస్ ధరలు,  ద్రవ్యోల్బణం  రేటు, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లో భారత్ ర్యాంక్ ను 107 కు పెంచిన పీఎంగా మోడీ ఖ్యాతి గడించారని ఎద్దేవా చేశారు. జేపీ నడ్డా మర్రిగూడలో 300 పడకల ఆసుపత్రి కడ్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బండి సంజయ్, రాజగోపాల్ రెడ్డి, కిషన్ రెడ్డి తాము మునుగోడు ప్రజలకు, రాష్ట్రానికి చేసిందేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 

జగన్నాథంకు ఫోన్ చేసింది నేనే.. ఓట్ల కోసం ఎవరికైనా ఫోన్ చేస్తం

జగన్నాథంతో ఫోన్ లో  మాట్లాడింది తానేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయనకు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను వివరించానని, అందులో తప్పేముందని మంత్రి ప్రశ్నించారు. మునుగోడులో టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల లబ్ది చేకూరిన ప్రతి ఒక్కరిని ఓటు అడిగే హక్కు తమకుందని చెప్పారు. ఎనిమిదేళ్లుగా కేసీఆర్ నాయకత్వంలో చిత్తశుద్ధితో  పని చేస్తున్నామని, సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల్లా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకప్పుడు దండగ అన్న వ్యవసాయాన్ని ఇవాళ పండగ చేశామని చెప్పారు. యువతకు ఉద్యోగాలు కల్పించామని, నల్గొండలో ఫ్లోరోసిస్ లేకుండా చేశామని తెలిపారు. తాము చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి శ్వేత పత్రం విడుదల చేస్తామని... మరి రాష్ట్రానికి ఏం  బీజేపీ ప్రభుత్వం చేసిందో శ్వేత పత్రం విడుదల చేస్తుందా అని ప్రశ్నించారు. మోడీ కరోనా వ్యాక్సిన్ కనుగొన్నారని కిషన్ రెడ్డి చెబుతున్నారని, ఆయన అమాయకత్వానికి తాము జాలి పడుతున్నామని ఎద్దేవా చేశారు. తన వ్యాపారం కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లారని విమర్శించారు. రాజగోపాల్ రెడ్డిని గెలిపించడానికి ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి బాగా కృషి చేస్తున్నారని, వాళ్లు కోమటిరెడ్డి బ్రదర్స్ కాదని.. కోవర్ట్ బ్రదర్స్ అని ఆరోపించారు. మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.