హైదరాబాద్: 105 అసెంబ్లీ సీట్లున్న టీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కోల్పోయినంత మాత్రాన పోయేదేమీ లేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన టీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి ప్రతినిధుల సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ ఇచ్చిన రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ కు ఆశపడే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ కోసమే మునుగోడు ఎన్నిక వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. వాళ్లిద్దరూ కోమటిరెడ్డిలు కాదని కోవర్ట్ రెడ్డిలు అన్న కేటీఆర్... తమ్ముడు కాంట్రాక్ట్ కోసం బీజేపీ తరఫున పోటీ చేస్తుంటే... అన్న విదేశాలకు వెళ్తున్నాడని విమర్శించారు.
రూ.18 వేల కోట్లు మునుగోడు కోసం ఖర్చు చేస్తే... ఎన్నికల నుంచి తప్పుకుంటాం
కాంట్రాక్టు రూపంలో దక్కించుకున్న రూ. 18 వేల కోట్లను మునుగోడు ప్రజల అభివృద్ధికి ఖర్చు చేస్తామని బీజేపీ ప్రభుత్వం హామీ ఇస్తే.... తాము మునుగోడు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటామని కేటీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఎన్నికలను మోడీ, అమిత్ షా అహంకారానికి... తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటంగా అభిర్ణించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలకు పేర్లు మార్చి... తమ పథకాలుగా చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులు నోరు తెరిస్తే గుజరాత్ మోడల్ అంటున్నారని, వాస్తవానికి అదొక బేకార్ మోడల్ అని మంత్రి విమర్శించారు. తెలంగాణ బెస్ట్ అంటూ ఓ వైపు అవార్డులు ఇస్తూ... మరోవైపు విమర్శించడం సరికాదని హితవు పలికారు.
మునుగోడులో టీఆర్ఎస్ విజయం పక్కా
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయం సాధించడం పక్కా అని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో ఫ్లోరిన్ సమస్య లేకుండా పారదోలామని, ప్రజలు తమకు ఓటు వేయడానికి ఈ ఒక్క కారణం చాలు అని అన్నారు. ఉత్తమ మున్సిపాలిటీగా చండూరు కేంద్రం నుంచి అవార్డ్ పొందిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే 49 వేల మందికి రైతు బంధు ఇస్తున్నామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న కేసీఆర్.. ఇప్పుడు దేశం కోసం బయలుదేరితే బీజేపీ నాయకుల్లో భయం మొదలైందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం ఖాయమని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.