మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం : మంత్రి తలసాని

మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని మంత్రి తలసాని స్పష్టం చేశారు. సనత్ నగర్ లో రూ.3.87 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి తలసాని... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే మునుగోడు ప్రజలకు ఫ్లోరైడ్ భూతం నుండి శాశ్వత విముక్తి లభించిందని తెలిపారు. ఫ్లోరైడ్ బారినపడి అనేకమంది అంగవైకల్యం పొందారన్న ఆయన... మిషన భగీరథ ద్వారా సురక్షిత మంచినీటి సరఫరాతో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం అయిందన్నారు. 50 సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించలేకపోయిందని ఆరోపించారు. 

ఇండియా మ్యాప్ రహిత ప్రాంతాల్లో ఈ రోజు మునుగోడు కూడా ఉందని మంత్రి తలసాని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు తీసుకొచ్చిందో ప్రజలకు తెలుసన్న తలసాని... హుజురాబాద్ లో, దుబ్బాకలో గెలిచిన తర్వాత మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయన్న తీసుకొచ్చిన్రా చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్స్ బలవంతంగా ఎందుకు తీసుకొచ్చారో కూడా చెప్పాలన్నారు. ఒక వ్యక్తి స్వార్థం కోసం జరిగిన ఎన్నికలన్న మంత్రి... 45,50 ఏళ్లు కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించింది.. కానీ రాష్ట్రానికి ఏం చేసిందని మండిపడ్డారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థే మునుగోడు ఎన్నికల్లో గెలుస్తడని, అభివృద్ధి అంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వమే చేస్తుందని, కేసీఆర్ పై ప్రజలకు నమ్మకం ఉందని తలసాని విశ్వాసం వ్యక్తం చేశారు.