
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ రెండో వేతన సవరణ కమిషన్ రిపోర్టును వెంటనే తెప్పించుకొని 51% ఫిట్మెంట్ తో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్, మారెడ్డి అంజిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ఆదివారం హైదరాబాద్ లో టీఆర్టీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 2023 జులై నుంచి అమలు కావలసిన వేతన సవరణ... ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని చెప్పారు. కేంద్రం ప్రకటించిన 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే మంజూరు చేయాలని కోరారు. వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. టీజీఈజేఏసీ 57 డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే జూన్ 9న హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు.