
పాట్నా: బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన టెంపో ప్రయాణికులతో వెళ్తోన్న ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. టెంపో, ఆటో పరస్పరం ఢీకొని నూరా బ్రిడ్జి పై నుంచి కిందపడ్డాయి. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది.
బీహార్ రాజధాని పాట్నాకు 35 కిలో మీటర్ల దూరంలోని మసౌధి-నౌబత్‌పూర్ రోడ్డు నూర్ బజార్ వద్ద ఆదివారం (ఫిబ్రవరి 23) రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.
ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని.. ఇందులో ఏడుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారని వెల్లడించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 12 మంది ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. టెంపో, ఆటో రిక్షా ప్రమాదంతో ఘటన స్థలంలో భీతావాహ వాతావరణం నెలకొంది.