
ఆంధ్రప్రదేశ్‌లో రేపు ( మే3) లారీలు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి మద్దతుగా లారీలను బంద్ చేయనున్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం సుదీర్ఘంగా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు ఇలా అన్ని రంగాల నుంచి వారికి మద్దతు లభిస్తూనే ఉంది. ఇప్పుడు విశాఖ ఉక్కుఫ్యాక్టరీ పరిరక్షణ కోసం లారీఓనర్స్ అసోసియేషన్ కూడా ముందుకుకదిలింది.. బుధవారం రోజు (మే3) రాష్ట్రవ్యాప్తంగా లారీల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు వెల్లడించారు.
విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి సంఘీభావం
విశాఖ ఉక్కుకార్మికుల పోరాటానికి సంఘీభావంగా అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు ఈనిర్ణయానికి వచ్చినట్టు ప్రకటించారు. రేపు (మే3) ఉదయం 9 గంటల నుంచి లారీలను ఎక్కడికక్కడే నిలిపివేయాలని లారీ యజమానులకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రవాణా రంగానికి విశాఖ ఉక్కు కర్మాగారం వెన్నుముకగాఉంది. నాణ్యమైన ఉక్కుఉత్పత్తి కారణంగా రోజుకు 2వేల లారీల ఎగుమతి,దిగుమతుల సామర్థ్యంతో లక్షలమంది జీవనోపాధి పొందుతున్నారు. ఇలాంటి ఫ్యాక్టరీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా లారీ యజమానులందరూ ఈ బంద్‌లు భాగస్వాములు కావాలని కోరారు.. లారీలను ఆపివేయాలని పిలుపునిచ్చారు. కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలో విశాఖ ఉక్కు పరిరక్షణే ధ్యేయంగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి.
800 రోజులుగా...
ఉమ్మడి రాష్ట్రంలో 32 మంది తెలుగు ప్రజల బలిదానంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించటం బాధాకరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెలువడినప్పటి నుంచి ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక వర్గం 800 రోజులుగా మొక్కవోని దీక్షతో పోరాటం సాగిస్తోందని తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులకు రాష్ట్ర ప్రజానీకం అండగా ఉందన్నారు. రైతులు ఇచ్చిన 22 వేల ఎకరాల్లో నిర్మించిన ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవటం మనందరి బాధ్యతని పేర్కొన్నారు.