ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా.. డైరీ క్వీన్ బంపర్ ఆఫర్

ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా.. డైరీ క్వీన్ బంపర్ ఆఫర్

ఒట్టావా: కెనడా ప్రధాన మంత్రి పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కెనడా పీఎం పదవితో పాటు అధికార లిబరల్ పార్టీ అధ్యక్ష పదవికి సైతం ఆయన రిజైన్ చేశారు. 2025, జనవరి 6వ తేదీన ట్రూడో ఈ ప్రకటన చేశారు. పార్టీలో పెరుగుతోన్న అసమ్మతి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రూడో వెల్లడించారు. నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు తాత్కలిక ప్రధానిగా కొనసాగుతానని.. కొత్త పీఎం ఎంపిక పూర్తిగా కాగానే పదవి నుండి తప్పుకుంటానని అనౌన్స్ చేశాడు. 

ట్రూడో రాజీనామా చేయడంతో కెనడాలో ఆయన వ్యతిరేకులు సంబురాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ట్రూడో రాజీనామా సందర్భంగా కెనడాలో ప్రముఖ రెస్టారెంట్ డెయిరీ క్వీన్ (డీక్యూ) ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ‘‘ట్రూడో రిజైన్ స్పెషల్’’ ఆఫర్ కింద కేవలం రెండు డాలర్లకే బర్గర్ అందించనున్నట్లు ప్రకటించింది. డెయిరీ క్వీన్ స్పెషల్ డ్రైవ్‎కు సంబంధించిన  ‘‘గ్రిల్ & చిల్.. ట్రూడో రాజీనామా స్పెషల్.. $2 బర్గర్స్ డ్రైవ్’’ పోస్టర్లు ప్రస్తుతం కెనడాతో పాటు సోషల్ మీడియాలో వైరల్‎గా మారాయి. 

ఈ పోస్టర్‎పై నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. నేను వెళ్లే లోపే స్పెషల్ డ్రైవ్ ముగిసిందని ఒకరు.. ఇది నిజమా.. రేపు నేను లంచ్ కు డీక్యూకు వెళ్లాబోతున్నానని ఇంకొరు కామెంట్లు చేశారు. ఇందులో జోక్ ఏమి లేదని.. ఇప్పటికే బర్గర్లు అయిపోయి ఉండొచ్చిన మరో నెటిజెన్ ఛలోక్తి విసిరారు. దేశ ప్రధాని రాజీనామా చేస్తే ఒక రెస్టారెంట్ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం కెనడాలో హాట్ టాపిక్ గా మారింది. 

ALSO READ | నేపాల్ భూకంపం విధ్వంసమే సృష్టించింది.. 100 దాటిన మృతులు.. వేలాది ఇళ్లు నేలమట్టం

కాగా, 53 ఏళ్ల ట్రూడో నవంబర్ 2015లో కెనడా పీఎంగా బాధ్యతలు స్వీకరించారు. రెండు టర్ముల్లో మొత్తం 9 ఏళ్లు ఆయన ప్రధానిగా పని చేశారు. తద్వారా కెనడాలో ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన మంత్రులలో ఒకరిగా నిలిచారు. అయితే, గత రెండు సంవత్సరాలుగా ట్రూడోకు ఇంటా బయటకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కెనడా ఆర్థి్క పరిస్థితి దారుణంగా పడిపోవడంతో పాటు ట్రూడో తీసుకున్న కొన్ని నిర్ణయాలు రాజకీయంగానూ అధికార పార్టీకి సమస్యగా మారాయి. మరీ ముఖ్యంగా ఖలిస్తానీ టెర్రరిస్ట్ నిజ్జర్ హత్య కేసులో భారత్‎తో ట్రూడో వ్యవహరించిన తీరు ఆయనకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.

ట్రూడో తీరుతో భారత్, కెనడా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇరు దేశాలు దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిపించుకున్నాయంటే పరిస్థితి ఎక్కడికి వెళ్లిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ ఏడాది చివర్లో కెనడా శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న ట్రూడో నేతృత్వంలో ఎన్నికలకు వెళ్తే భారీ దెబ్బ తప్పదని అధికార పార్టీ ముందుగానే గ్రహించింది. 

ఈ నేపథ్యంలోనే ట్రూడో రాజీనామా చేయాలని సొంత పార్టీ నుండి డిమాండ్లు మొదలయ్యాయి. ఇటీవల ట్రూడో కేబినెట్ లోని కెనడా ఫైనాన్స్ మినిస్టర్ రాజీనామా చేయడంతో ట్రూడోపై రాజీనామా ఒత్తిళ్లు మరింత అధికం అయ్యాయి. ఇదే కాకుండా ట్రూడో నేతృత్వంలో కెనడా ఆర్థిక పరిస్థితి కూడా మందగించింది. ఇటు పాలన పరంగా.. అటు పార్టీ పరంగా రెండు వైపులు అసమ్మతి వ్యక్తం కావడంతో దీంతో చేసేదేమి లేక ట్రూడో తన ప్రధానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.